Oscar Awards 2025 | సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 2025 ఆస్కార్ పురస్కారాల నామినేషన్ జాబితాను అకాడమీ ప్రకటించగా.. ఇందులో ‘ఎమిలియా పెరెజ్’(Emilia Perez) చిత్రం మొత్తం పదమూడు నామినేషన్స్ సాధించి ఆస్కార్ రేసులో అగ్ర భాగాన నిలిచింది. అయితే ‘ఎమిలియా పెరెజ్’లో నటనకు గాను నటి కార్లా సోఫియా గాస్కాన్(Karla Sofia Gascon) ఉత్తమ నటి విభాగంలో పోటిపడుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం ఒక ట్రాన్స్ జెండర్(Transgender Actor) నటి ఈ విభాగంలో నామినేట్ అయ్యింది. ఇదిలావుంటే తాజాగా కార్లా సోఫియా గాస్కాన్ వివాదంలో చిక్కుకుంది. అప్పట్లో తాను చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు ఇప్పుడు తన ఆస్కార్‌కి చిచ్చుపెట్టేలా చేశాయి.
నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తిని అమెరికా పోలీసులు కాలుతో తొక్కి చంపిన విషయం తెలిసిందే. 2020లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ విషయంపై అమెరికాలో పెద్ద ఎత్తున్న నిరసనలు జరగడమే కాకుండా ప్రభుత్వం కూడా దిగివచ్చి క్షమాపణలు తెలిపింది. అయితే ఈ వివాదంపై నటి కార్లా సోఫియా స్పందిస్తూ.. చాలా మంది జార్జ్ ఫ్లాయిడ్ మరణం గురించి పట్టించుకోలేదు. అతడు ఒక మాదకద్రవ్యాలకు బానిసయైన మోసగాడు, కానీ అతని మరణం మళ్లీ ఒకసారి నల్లజాతి ప్రజలను హక్కులు లేని వారిగా భావించేవారిగా చేసింది. అలాగే పోలీసులు హంతకులుగా చిత్రీకరిస్తుంది. ఇది అందరి తప్పు అని వెల్లడించింది.
ఇస్లాం మతంపై స్పందిస్తూ.. ఇస్లాం అనేది మానవాళికి వైరస్‌గా మారుతుంది. దీనిని తుడిచివేయాలి అంటూ రాసుకోచ్చింది. అలాగే ఆస్కార్ అవార్డులపై కూడా విమర్శలు చేస్తూ.. నేను ఆస్కార్ అవార్డుల పోటీకి వచ్చానో లేదా బ్లాక్ లైవ్స్ మేటర్ ఈవెంట్‌కి వచ్చానో తెలియట్లేదు. ఇది ఆఫ్రికన్ – కొరియన్ పండుగలా ఉంది అంటూ చెప్పుకోచ్చింది. అయితే ఈ వ్యాఖ్యలను ప్రస్తుతం నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. దీంతో ఆస్కార్‌కి కార్లాని ఎలా నామినేట్ చేశారని సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
మరోవైపు తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపింది నటి.. నా గత సోషల్ మీడియా పోస్టుల గురించి నేను క్షమాపణలు తెలపాలి అనుకుంటున్నాను. ఈ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు.. నా వలన బాధపడిన వారిపై నేను తీవ్రంగా చింతిస్తున్నాను. నా జీవితమంతా నేను మెరుగైన ప్రపంచం కోసం పోరాడాను. వెలుగు ఎల్లప్పుడూ చీకటిపై విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను అంటూ కార్ల రాసుకోచ్చింది.