“మనం ఫైనాన్షియల్ క్రైమ్ గురించి వింటూ ఉంటాం. ఎలా జరుగుతాయో తెలీదు. ఈ సినిమాలో వాటిని దర్శకుడు కళ్లకు కట్టాడు. ఈ కథలో రెండు ప్రపంచాలుంటాయి. ఒకటి బ్యాంక్ ప్రపంచం, రెండోది గ్యాంగ్‌స్టర్ ప్రపంచం. ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తా.” అని హీరో డాలీ ధనంజయ్ తెలిపారు. సత్యదేవ్‌తో కలిసి ఆయన నటించిన యాక్షన్ ఎంటైర్టెనర్ ‘జీబ్రా’.
ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు. ఎస్.ఎన్.రెడ్డి, ఎస్.పద్మజ, బాలసుందరం, దినేష్ సుందరం నిర్మాతలు. నవంబర్ 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా డాలీ ధనంజయ్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ‘వాణిజ్యవిలువల కలబోత ఈ చిత్రం. సత్యదేవ్‌తో నటించడం ఓ గొప్ప అనుభూతి. ఇందులో ప్రతి పాత్ర కీలకమే.’ అని చెప్పారు. రవి బస్రూర్ సినిమాకు కొత్త సౌండ్ ఇచ్చారనీ, నిర్మాతలు పాషన్‌తో తీసిన ఈ సినిమా తప్పక సక్సెస్ అవుతుందని డాలీ ధనంజయ్ నమ్మకంగా చెప్పారు.