సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘జెట్లీ’. రితేష్ రానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. శనివారం సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘మేడిపండు చూడ మేలిమై యుండును..’ అంటూ వేమన పద్యంతో మొదలైన గ్లింప్స్ ఆద్యంతం నవ్వుల్ని పంచింది.
ఫ్లైట్ హైజాక్ సందర్భంలో సత్య పాత్రను పరిచయం చేశారు. సత్య-వెన్నెల కిషోర్ మధ్య వచ్చే ఓ డైలాగ్ హైలైట్‌గా నిలిచింది. ‘నువ్వు ఏ టైర్ హీరోవి? అని వెన్నెల కిషోర్.. సత్యని అడిగినప్పుడు ‘జనరల్ కంపార్ట్మెంట్’ అంటూ ఆయన బదులివ్వడం నవ్వుల్ని పంచింది. ఈ సినిమా వినోదాల విందుభోజనంలా ఉంటుందని దర్శకుడు రితేష్ రానా అన్నారు. ఇప్పటికే 60శాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత చెర్రీ పేర్కొన్నారు. రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం: కాలభైరవ, దర్శకత్వం: రితేష్ రానా