‘రాజకీయాల్లో జరిగిన సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ‘శాసనసభ’ కథను రెడీ చేశాను. ‘శాసనసభ’ అంటే పవిత్రస్థలం. దానిని దేవాలయంగా భావించాలనే సందేశాన్ని ఈ చిత్రంలో జోడించాం. ‘శాసనసభ’ ప్రతిష్టను పెంచే విధంగా ఈ చిత్రం వుంటుంది’ అన్నారు కె.రాఘవేంద్ర రెడ్డి. ఇంద్రసేన హీరోగా నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రాఘవేంద్ర రెడ్డి ‘శాసనసభ’ చిత్రంతో రచయితగా మారారు.
ఈ సందర్భంగా గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ‘జర్నలిజంలో వున్న అనుభవం, రాజకీయాల పట్ల నాకున్న పరిజ్ఞానంతో పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ కథను తయారుచేశాను. ఈ చిత్రంలో నేటి రాజకీయాలపై విమర్శలు ఉంటాయి. అయితే ఏ పార్టీనో, రాజకీయ నాయకుడో లక్ష్యం మాత్రం కాదు. కానీ కాకతాళీయంగా సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే విధంగా ఈ చిత్ర కథ ఉంటుంది.
రాజకీయ వ్యవస్థలో వున్న లోటుపాట్లను చర్చిస్తూ.. ఓటు విలువ తెలియజేసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రతి సన్నివేశం అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో ఉండే సందేశం అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఈ చిత్రంతో పాటు నేను కథను అందించిన మరో యాక్షన్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ షూటింగ్ జరుగుతున్నది. మరో పాన్ఇండియా కథ రెడీగా వుంది. దీంతో పాటు మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది’ అన్నారు.