Vijay Devarakonda | “సారంగపాణి జాతకం’ టీజర్ చూశాను. చాలా బావుంది. అందులో దర్శి పాత్రకు జాతకాల పిచ్చి. నిజానికి జాతకాలు ఎంతవరకు నిజం అనేది నాకూ తెలియదు. డెస్టినీ మనల్ని నడిపిస్తుంది అని మాత్రం నమ్ముతా. ‘పెళ్లి చూపులు’ చేసేటప్పుడు నేనూ, ప్రియదర్శి ఈ స్థాయికి వస్తామని అనుకోలేదు. దర్శితోనే నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు దర్శి ప్రయాణం చూస్తుంటే నాకెంతో హ్యాపీగా ఉంది. ఇంట్రస్టింగ్ కథల్లో లీడ్‌రోల్స్ చేస్తూ మనకు మంచి సినిమాలు అందిస్తున్నాడు. ‘సారంగపాణి జాతకం’ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’ అని విజయ్ దేవరకొండ అన్నారు.
ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. డిసెంబర్ 20న సినిమా విడుదల కానుంది. గురువారం స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేసి మాట్లాడారు.
ఇక టీజర్ విషయానికొస్తే.. రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా ఆద్యంతం వినోదభరితంగా ఈ టీజర్ సాగింది. వెన్నెలకిశోర్, అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ టీజర్లో నవ్వించాయి. రూప కొడువాయూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నరేష్, తనికెళ్ల భరణి, వైవా హర్ష, శివన్నారాయణ, అశోక్‌కుమార్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: పి.జి.విందా, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: శ్రీదేవి మూవీస్.