Sarangapani Jathakam Review | టాలీవుడ్లో ఈ మధ్య కామెడీ సినిమాలకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవల వచ్చిన టిల్లు, టిల్లు స్క్వేర్, మ్యాడ్ చిత్రాలు ప్రేక్షకులకు నవ్వులనుపంచాయి. అయతే ఇదే కోవలో నవ్వించడానికి తెలుగు నుంచి మరో సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ సినిమాకు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించగా.. రూప కొడువాయూర్ కథానాయికగా నటించింది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది. కోర్ట్ తర్వాత ప్రియదర్శి మళ్లీ హిట్టు అందుకున్నాడా అనేది రివ్యూలో చూద్దాం.
కథ
ప్రముఖ కార్ల కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తుంటాడు సారంగపాణి (ప్రియదర్శి). తన పనితనంతో రెండేండ్ల నుంచి బెస్ట్ ఎంప్లాయ్‌గా కొనసాగుతుంటాడు. అయితే అదే కార్ల కంపెనీలో మేనేజర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటుంది మైథిలీ (రూప కొడువాయూర్). మైథిలీ అంటే సారంగపాణికి చాలా ఇష్టం. ఇదే విషయాన్ని తనకు చెబుదామనుకుంటాడు. కానీ పాణికి చిన్ననాటి నుంచి జ్యోతిష్యం మీదా నమ్మకం ఎక్కువ.. తన లైఫ్‌లో ఏం పనిచేసిన గ్రహాలు అనుకులంగా ఉన్నాయా అని చూసుకొని పని మొదలుపెడతాడు. దీంతో మైథిలీతో ప్రేమ విషయం కూడా మంచి ముహూర్తం చూసి చెప్పాలనుకుంటాడు. అయితే మైథిలీ మాత్రం నమ్మకాల్ని పట్టించుకోని ఆధునిక భావాలతో పెరిగిన ఒక యువతి. పాణి ముహూర్తం చూసి చెప్పాలి అనుకునే గ్యాప్‌లో మైథిలీ వచ్చి పాణికి ప్రపోజ్ చేసేస్తుంది. దీంతో వారి ప్రేమ కథ సంతోషంగా సాగుతూ పెళ్లి వరకు వెళుతుంది.
ఈ క్రమంలోనే సారంగపాణి ఒకరోజు పబ్‌లో ఉండగా.. అతడిని జిగేశ్వరానంద (అవసరాల శ్రీనివాస్) అనే ఒక హస్తసాముద్రికుడు(Palmist) చూసి అతడి చేతిని పరిశీలించి భవిష్యత్తులో ఒక హత్య చేస్తాడని జోస్యం చెబుతాడు. జాతకాలను గట్టిగా నమ్మే పాణి జిగేశ్వరానంద చెప్పింది విని ఆందోళన చెందుతాడు. మర్డర్ చేస్తాను అనే భయంతో తన పెళ్లిని కూడా వాయిదా వేసుకుంటాడు. అయితే తన జాతకంలో హత్య చేయాలి అని పక్కరాసి ఉంది కాబట్టి ఆ హత్య ఏదో పెళ్లికి ముందు చేసేసి లైఫ్‌లో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు పాణి. ఈ క్రమంలోనే తన చిన్ననాటి స్నేహితుడు అయిన చందు (వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. అయితే సారంగపాణి, చందూ కలిసి హత్య చేయాలనుకుంటున్న వ్యక్తి ఎవరు. పాణి, చందూ కలిసి ఆ హత్య చేశారా. ఈ జిగేశ్వరానంద ఎవరు.. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
జాతకాల పిచ్చోడి కథ అనగానే ఈవీవీ ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా గుర్తురాక మానదు. సారంగపాణి జాతకం కూడా అలాంటి కాన్సెప్ట్ ఛాయలు వున్న కథే కానీ దీనికి ‘హత్య’ కోణాన్ని జోడించి వినోదాత్మకంగా చెప్పడంలో దర్శకుడు పై చేయి సాధించాడు. హీరో లవ్ స్టొరీతో మొదలైన కథ అవసరాల పాత్ర రాకతో ఒక్కసారి వేగం పుంజుకుంటుంది. నిజానికి సిల్లీగా అనిపించే ఈ కథని ఇంద్రగంటి తన రేటింగ్ బలంతో ఆకర్షిణీయంగా మలిచారు.
పెళ్లికి ముందే ఓ మర్డర్ చేసేయాలని సారంగ వెన్నెల కిషోర్ పాత్రలు చేసుకునే ప్లాన్ థియేటర్స్ లో నవ్వులు పూయించేలా వుంటాయి. బామ్మ ఎపిసోడ్ హైలెట్ గా నిలిస్తుంది. నిజానికి ఇలాంటి కథల్లో సెకండ్ హాఫ్ టఫ్. కానీ ఇంద్రగంటి తన రచన బలంతో ప్రేక్షకులు కావాల్సిన కామెడీని అందించగలిగారు. సెకండ్ హాఫ్ ఓ హోటల్ చుట్టూనే తిరుగుతున్నా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపారు.
నటీనటులు
కోర్ట్‌లో లాయర్‌గా అలరించిన ప్రియదర్శి.. ఇప్పుడు సారంగపాణిగా తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. జాతకాల పిచ్చి వున్న పాత్ర రిలేట్ చేసుకునేలా వుంటుంది. కథానాయిక రూప కొడువాయూర్ అందం, నటనతో మెప్పించింది. వెన్నెల కిశోర్‌ది హీరోతో సమానమైన పాత్ర. వైవా హర్ష ద్వితీయార్థంలో నవ్వించాడు. శ్రీనివాస్ అవసరాల క్రైమ్ కోణం కీలకం. వి.కె.నరేష్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు తమ పాత్రల్లో మెరిశారు.
సాంకేతికంగా
వివేక్ సాగర్ మ్యూజిక్ లైవ్లీ గా వుంది. కెమరా వర్క్ డీసెంట్ గా వుంది. ఇంద్రగంటి మాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు నుడికారం ప్రాసతో కూడిన డైలాగులు గిలిగింతలు పెడతాయి. నిర్మాత కథకు కావాల్సినది సమకూర్చారు. మంచి కామెడీ వున్న సినిమా వచ్చి చాలా కాలమైయింది. ఆ లోటుని భర్తీ చేసిన ఇది. సరదాగా కాలక్షేపాన్ని ఇచ్చే కంటెంట్ పుష్కలంగా వుంది.
బలాలు:
హాస్యం
నటీనటుల ప్రదర్శన
కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రం
బలహీనతలు:
ద్వితీయార్థంలోని కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించడం
రేటింగ్: 3/5