‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంతో సంక్రాంతి బరిలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఈ సినిమా 300కోట్ల పై చిలుకు వసూళ్లతో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమా అప్డేట్ గురించి ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
‘మెగా 158’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తారు. గతంలో ఈ కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిసింది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని వార్తలొస్తున్నాయి.
చిన్నాన్న, బాబాయ్ అనే సమానార్థంలో ‘కాకా’ అనే పదాన్ని కొన్ని ప్రాంతాల్లో వాడుతారు. మాస్ అప్పీల్ కలిగిన ఈ టైటిల్ వైపే చిత్రబృందం మొగ్గుచూపుతున్నదని టాక్. అయితే టైటిల్ విషయంలో నిజానిజాలేమిటో తెలియాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. ‘మెగా 158’ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతాన్నందిస్తారని సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనుంది.