రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో సంజయ్‌దత్, అర్షద్ వార్సీ లీడ్రోల్స్గా రూపొందిన మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్, లగేరహో మున్నాభాయ్ చిత్రాలు ఎంతటి ఘనవిజయాలను సాధించాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా పార్ట్ 3 కోసం ప్రస్తుతం అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజానికి 2007లోనే పార్ట్ 3ని రాజ్‌కుమార్ హిరానీ ప్రకటించారు. ‘మున్నాభాయ్ చలే అమెరికా’ పేరుతో ఓ టీజర్‌ని కూడా విడుదల చేశారు.
కానీ ఎందుకో అంతకంతకూ అది ఆలస్యమవుతూ వచ్చింది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఎట్టకేలకు హిరానీ ఈ సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభించారట. ఈ విషయాన్ని ఇందులో ప్రధాన పాత్రధారుల్లో ఒకరైన అర్షద్ వార్సీ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘మున్నాభాయ్ పార్ట్ 3 పనులు మొదలయ్యాయి.
మళ్లీ సంజూ భాయ్‌తో కలిసి పని చేయబోతున్నాననే ఫీలింగే చెప్పలేని ఆనందాన్నిస్తోంది. రెండు భాగాలకంటే బెస్ట్‌గా ఈ మూడో పార్ట్ ఉండేలా రాజ్‌కుమార్ హిరానీ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రచయిత విధు వినోద్ చోప్రా కూడా ఈ సినిమాకు పనిచేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.’ అని తెలిపారు. మున్నాభాయ్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.