Mazaka Movie Review | వరుసగా సీరియస్ సినిమాలు చేస్తున్న సందీప్‌కిషన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మజాకా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ధమాకా’ లాంటి మాస్ ఎంటర్ టైనర్ తర్వాత డైరెక్టర్ త్రినాథరావు నక్కిన డైరెక్టర్ చేసిన సినిమా ఇది. రావు రమేష్ మరో లీడ్ గా కనిపించడం, ట్రైలర్, టీజర్ లో వినోదం ఆసక్తిని రేపింది. మరీ మజాకాlo వున్న కథ ఏమిటి? సినిమా ప్రేక్షకులకు ఎలాంటి వినోదం పంచింది? రివ్యూలో చూద్దాం.
కథ: వెంకటరమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) తండ్రీ కొడుకులు. ఇంట్లో ఆడదిక్కు వుండదు. ఎలాగైనా ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫొటోని చూసుకోవాలనేది వారి తపన. కృష్ణకి పెళ్లి చూపులు చూస్తుంటాడు తండ్రి. అయితే ఆడదిక్కు లేని ఇంట్లోకి ఎవ్వరూ అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రారు. వెంకటరమణ పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలూ తీరుతాయని ఒకరు సలహా ఇస్తారు. ఇదే సమయంలో వెంటకరమణకి యశోద (అన్షు) పరిచయం అవుతుంది. మరోపక్క కృష్ణ కూడా మీరా (రీతూవర్మ) ప్రేమలో పడతాడు. తర్వాత ఏం జరిగింది. వీళ్ల ప్రేమకథల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంట్లో ఫ్యామిలీ ఫోటో చూసుకోవాలనే వారి కోరిక తీరిందా ? ఇదంతా తెరపై చూడాలి.
కథావిశ్లేషణ: ఓ ఆడదిక్కు కోసం ఆరాటపడే తండ్రీ కొడుకుల కథ ఇది. నిజానికి చాలా మంచి పాయింట్. ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అన్ని ఎలిమెంట్స్ ఈ పాయింట్ లో వున్నాయి. దర్శకుడు ఈ పాయింట్ ని ఎలాంటి అసభ్యతకు తావులేకుండా క్లీన్ ఎంటర్టైనర్ గా నడిపారు. తండ్రీ తనయులు ప్రేమకథల్ని సమాంతరంగా నడిపిస్తూ ప్రథమార్ధం తీర్చిదిద్దారు. వారి ప్రేమకథలు, ప్రేమలేఖల ఎపిసోడ్, ఇంటర్వెల్ ట్విస్ట్ అలరించేలా వుంటాయి. కథలోని లాజిక్స్నీ పట్టించుకోకుండా చూస్తే కొన్ని సీన్లు వర్క్ అవుట్ అవుతాయి. కథ, కథనాలు ఊహకు అందుతుంటాయి కానీ విరామం వరకూ కాలక్షేపం అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఈ కథ కాస్త ట్రాక్ తప్పింది. మేనత్త మేనకోడలు ట్రాక్ లో లాజిక్ మోషన్ లోపించింది. చివర్లో ఎమోషనల్ క్లైమాక్స్ ఆకట్టుకునేలా వుంది.
నటీనటులు నటన: సందీప్‌కిషన్ హుషారుగా కనిపించారు. తన కామెడీ టైమింగ్ మెప్పిస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. రావు రమేష్ పాత్ర ఇందులో కీలకం, చాలా నిడివి వున్న పాత్ర. ఆయన అనుభవంతో ఆ పాత్రని పండించారు. రీతు వర్మ నటన ఆకట్టుకుంటుంది. డ్యాన్సుల్లో మెరిసింది. అన్షు పాత్ర హుందాగా వుంది.
మురళీశర్మ పాత్రని డిజైన్ చేసిన తీరు సైకో పగ అలరిస్తాయి. శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, హైపర్ ఆది అక్కడక్కడా నవ్విస్తారు.
టెక్నికల్ గా: లియోన్ జేమ్స్ మ్యూజిక్ డీసెంట్ గా వుంది. సొమ్మసిల్లి, పగిల్, బెబమ్మ పాటలు మాస్ కి నచ్చేలా వుంటాయి. కెమరాపనితనం కలర్ ఫుల్ గా వుంది. కథకు తగిన ప్రొడక్షన్ వాల్యూస్ వున్నాయి. ప్రసన్న రాసిన కొన్ని డైలాగ్స్ పేలాయి. త్రినాథ్ రావు నక్కిన మార్క్ వినోదం అక్కడక్కడ కనిపించింది. సెకండ్ హాఫ్ లో ఇంకాస్త ద్రుష్టి పెట్టివుంటే మజా ఇంకా పెరిగేది. అయితే ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా ఓ క్లీన్ ఇంటర్ టైనర్ అందించగలిగారు.
ప్లస్ పాయింట్స్
సందీప్, రావురమేష్ కెమిస్ట్రీ
కొన్ని కామెడీ సీన్స్
సాంగ్స్, ఎమోషనల్ క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
లాజిక్ లెస్ సీన్స్
సెకండ్ హాఫ్ లో మేనత్త మేనకోడలు ట్రాక్
రేటింగ్: 2.75/5