SS Rajamouli | దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ‘గ్లోబ్ ట్రాటార్’ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అతడు తనకు దేవుడి మీద నమ్మకం లేదంటూ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని పలు హిందూ సంఘాలు, రాజకీయ నాయకులు మా ‘భావోద్వేగాలు దెబ్బతిన్నాయి’ అంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సనాతన ధర్మ రక్షకులుగా చెప్పుకుంటున్న పలువురు వ్యక్తులతో పాటు బీజేపీ నేతలు రాజమౌళి తన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ బలంగా డిమాండ్ చేస్తున్నారు. వానర సేన అని ఒక ఆర్గనైజేషన్ అయితే రాజమౌళి మాటలపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది.
అయితే రాజమౌళి తన వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదం భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ (Freedom of Speech) పరిస్థితిని మరోసారి చర్చకు తెచ్చింది. ఒక ప్రఖ్యాత వ్యక్తి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెలిబుచ్చినా, దాన్ని ఇంత పెద్ద వివాదంగా మార్చడంపై ప్రజా మేధావులు, విశ్లేషకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేవుడిపై నమ్మకం లేకపోవడం అని రాజమౌళి చెప్పడం.. అలాగే సాంకేతిక సమస్య వచ్చినప్పుడు దేవుడిని తలచుకుంటే మంచి జరుగుతుందని చెప్పినప్పుడు ఆయన నిరాశ వ్యక్తం చేయడం పూర్తిగా ఆయన వ్యక్తిగత భావ స్వేచ్ఛకు సంబంధించిన అంశం. ఈ విషయంలో రాజమౌళి ఎవరినీ ఉద్దేశించి దూషించనప్పటికీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా అనవసరంగా రాజకీయం చేయడం లేదా దానికి మతపరమైన రంగు పులమడం సరికాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఒకప్పుడు అన్ని మతాలలోని లోసుగులు, మూఢనమ్మకాలపై సినిమాలు తీసిన సందర్భాలు, వాటిపై విమర్శలు చేసిన సందర్భాలు భారతీయ సినిమా చరిత్రలో చాలా ఉన్నాయి. అప్పుడు స్వేచ్ఛగా వ్యక్తం చేయబడిన అభిప్రాయాలు ఇప్పుడు వివాదాస్పదం కావడం విచారకరమని కొందరూ భావిస్తున్నారు. భవిష్యత్లో మతపరమైన వ్యాఖ్యలు ఏ చిన్నపాటి చేసినా, అది భావ స్వేచ్చకు ముప్పుగా పరిగణించాల్సిన పరిస్థితి రాబోతుందనే భయాన్ని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. దేశంలోని ఒక ప్రఖ్యాత వ్యక్తి తమ వ్యక్తిగత విశ్వాసాల గురించి మాట్లాడినా, దాన్ని ఇంత పెద్ద వివాదంగా మార్చడం అనేది భారతదేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ తగ్గుతోందా అనే కీలక ప్రశ్నను లేవనెత్తుతోంది.