Sampradayini Suppini Suddapoosani | నటుడు శివాజీ, నటి లయ ప్రధాన పాత్రల్లో నటించిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. దర్శకుడు సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని శివాజీ స్వయంగా నిర్మించారు. థియేటర్లలో విడుదలైన సమయంలో ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, కథలోని భావోద్వేగాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొంతమందిని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అదే సినిమా ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో మరింత విస్తృతమైన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రంలో శ్రీరామ్ (శివాజీ) ఒక నిజాయతీగల పంచాయతీ కార్యదర్శి. హార్స్‌లీహిల్స్ సమీపంలోని కొత్తకోటలో తన భార్య ఉత్తర (లయ), కుమారుడు బిట్టు అలియాస్ నితిన్ (రోహన్)తో కలిసి ప్రశాంత జీవితం గడుపుతుంటాడు. అయితే దీపావళి రోజున వారి ఇంటికి వచ్చిన ఎస్సై విక్రమ్ వాసుదేవ్ (ప్రిన్స్) అనూహ్యంగా హత్యకు గురవడం కథలో కీలక మలుపు. ఆ హత్యను శ్రీరామ్ కుమారుడు చేయడం కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది. ఈ సంఘటన తర్వాత జరిగే పరిణామాలు, నిజం వెలుగులోకి ఎలా వస్తుంది అన్నదే సినిమా ప్రధానాంశం.
థియేటర్లలో మిశ్రమ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం, ఓటీటీ ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. థ్రిల్లర్, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ కథ, ఇంటి వద్దే చూసే ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, థియేటర్లలో పెద్దగా రాణించలేకపోయిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమా, ఓటీటీలో మంచి రెస్పాన్స్ పొందుతుందా? లేదా, అనేది ఆసక్తికరంగా మారింది.