‘నరసింహా చారిగా ఓ చిన్నపల్లెటూరి నుంచి వచ్చిన నన్ను ‘హృదయకాలేయం’ సినిమాతో సంపూర్ణేష్బాబుగా మార్చారు దర్శకుడు సాయిరాజేష్. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అన్నారు నటుడు సంపూర్ణేష్‌బాబు. ఆయన హీరోగా సాయిరాజేష్ దర్శకత్వంలో రూపొందిన ‘హృదయకాలేయం’ సినిమా విడుదలై 11 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సంపూర్ణేష్‌బాబు మీడియాతో ముచ్చటించారు. “హృదయ కాలేయం’ రిలీజ్ టైమ్‌లో రాజమౌళిగారు చేసిన ట్వీట్వల్ల నాకు ఎంతో గుర్తింపు దక్కింది. ఎప్పుడు కలిసినా ఆయన ‘సంపూ..ఎలా ఉన్నావు’ అంటూ అప్యాయంగా పలకరిస్తారు’ అని చెప్పారు.
ఈ 11 ఏళ్లలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చాలా చిత్రాల్లో నటించానని, ఈ నెల 25న ‘సోదరా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని సంపూర్ణేష్ బాబు చెప్పారు. మరో రెండు చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, కామెడీతో పాటు సీరియస్ క్యారెక్టర్స్ కూడా చేయాలన్నది తన అభిమతమని, తన లైఫ్‌ైస్టెల్‌కు సరిపడని వాతావరణం కాబట్టి బిగ్బాస్షో నుంచి మధ్యలోనే బయటకొచ్చానని ఆయన తెలిపారు.