Sampath Nandi | మాస్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను సంతృప్తి పరిచే దర్శకులలో సంపత్ నంది ఒకడు. ఫ్యామిలీ కథకు కమర్షియల్ హంగులను జోడించి హిట్లు కొట్టడం ఈయన ప్రత్యేకత. చేసింది తక్కువ సినిమాలే అయినా టాలీవుడ్లో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవలే ఈయన దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా నటించిన ‘సీటీమార్’ విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన రెండు సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈయన మెగా హీరోతో తన నెక్స్ట్ చిత్రాన్ని చేయబోతున్నట్లు టాక్.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో సంపత్ నంది తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కథా చర్చలు ముగిసాయని, సాయిధరమ్ తేజ్‌కు కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం సాయిధరమ్, సుకుమార్ ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత పీపుల్ మీడియా బ్యానర్లో సినిమా చేయనున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాతే సంపత్ నంది చిత్రం పట్టాలెక్కనుంది. అయితే సంపత్ నంది ‘విక్రమార్కుడు’ సీక్వెల్ చేయబోతున్నట్లు గతంలో కథనాలు వచ్చాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ విక్రమార్కుడు సీక్వెల్ కథను సిద్దం చేస్తున్నాడని, కానీ దానికి రాజమౌళి కాకుండా సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడని పుకార్లు వచ్చాయి. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు.