Shaakunthalam Movie Trailer | గతేడాది ‘యశోద’తో భారీ విజయం సాధించిన సమంత.. ఈ ఏడాది అదే జోష్‌తో ‘శాకుంతలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొల్పాయి. శకుంతల, దుష్యంతుడి ప్రేమ కథను వెండితెరపై గుణ శేఖర్ ఏ విధంగా చూపిస్తాడో అని ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. కాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శాకుంతలం ట్రైలర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
లేటెస్ట్గా రిలీజైన ట్రైలర్ విజువల్ ఫీస్ట్‌లా అనిపిస్తుంది. ‘ఈ భూమ్మిద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది’. ‘శకుంతల ఒక కారణ జన్మురాలు.. నవ నాగరికతకు నాంది పలకబోతోంది’ అనే డైలాగ్స్ సమంత పాత్రను ఎలివేట్ చేస్తున్నాయి. ‘మాయ ప్రేమను మరిపిస్తుందేమో.. అభిమానాన్ని, అవమానాన్ని ఏ మాయ మరిపించలేదు’ అంటూ సమంత పలికిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మణిశర్మ సంగీతం మంచి ఫీల్ ఇస్తుంది. యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివర్లో సింహాం మీద అల్లు అర్హ ఎంట్రీ మాత్రం విజిల్స్ వేసేలా ఉంది.
నిజానికి ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ అది కాస్త దసరాకు పోస్ట్ పోన్ అయింది. పోని దసరాకైనా వచ్చిందా అంటే అది లేదు. ఆ తర్వాత నవంబర్, డిసెంబర్ అంటూ పలు మార్లు పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఎట్టకేలకు ఫిబ్రవరి 17న ఈ సినిమాను 3డీలో రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను గుణశేఖర్ ‘రుద్రమదేవీ’ తర్వాత దాదాపు ఏడేళ్ళు టైం తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించాడు.