దక్షిణాదిలో తిరుగులేని నటి అనిపించుకున్న హీరోయిన్ సమంతా రుతుప్రభు. పదిహేనేండ్లుగా ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించి అభిమానులను అలరిస్తున్నది. ఇటీవల విడుదలైన ‘శుభం’ సినిమాతో నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభించిందామె. వ్యక్తిగత కారణాల వల్ల యాక్టింగ్ నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకున్నానని త్వరలోనే ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానంటున్నది సామ్. జీవితంలో ఎదురైన ప్రతి సమస్యను సవాలుగా స్వీకరించానంటూ సమంత పంచుకున్న కబుర్లు..
ఏ విషయంలో అయినా నా మనసుకు నచ్చిందే చేశాను. ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయా. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా? అనుకున్నా. అతను తన ప్రేమను చూపించే తీరు మంచిదే అనిపించినా.. గుళ్లు కట్టి పూజలు చేసే పద్ధతిని మాత్రం ఎంకరేజ్ చేయను.
ఆరోగ్యపరమైన సమస్యల రీత్యా కొంతకాలం వర్క్ నుంచి బ్రేక్ తీసుకున్నా. యాక్టింగ్‌ను ఎంతో మిస్ అయ్యా. నటన మర్చిపోయానేమో అనిపించింది. ‘రక్త్ బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్డమ్’ షూట్‌లోకి అడుగుపెట్టిన తొలిరోజు అంత సులువుగా అనిపించలేదు. ఒకసారి యాక్టింగ్‌లోకి దిగితే జీవితాంతం అది మనలో భాగం అవుతుందని అప్పుడు అర్థమైంది.
జీవితంలో కొన్ని మంచిరోజులు, కొన్ని చెడ్డరోజులు ఉంటాయి. ఒకానొక స్టేజిలో లైఫ్‌లో ముందుకెళ్లలేనేమో అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఇంతదాకా వచ్చానా అనిపిస్తుంది. నటిగా నిలదొక్కుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆరాటపడేదాన్ని. ఈ క్రమంలో తొలినాళ్లలో కొన్ని నచ్చని కథలని కూడా ఎంచుకున్నా. ప్రస్తుతం కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా.
విజయం కన్నా ఓటమి వల్లే ఎక్కువ విషయాలు నేర్చుకోవచ్చు. నా సినిమా తొలిసారి ఫ్లాప్ అయినప్పుడు కుమిలిపోయా. నేనొక ఫెయిల్యూర్ని అనుకున్నా. ఇన్నాళ్ల అనుభవంతో సక్సెస్ అంటే నా దృష్టిలో నిర్వచనం మారింది. స్వేచ్ఛగా జీవించడమే విజయం అని అర్థమైంది. ప్రస్తుతం నేను సక్సెస్‌లో లేనని చాలామంది అనుకుంటారు. కానీ, గతంతో పోలిస్తే ఇప్పుడే విజయవంతంగా రాణిస్తున్నా.
‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’తో నిర్మాతగా కొత్త ప్రయాణం ప్రారంభించా. కొత్త కథలు చెప్పాలి. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్నది ‘ట్రాలాలా’ ముఖ్య ఉద్దేశం. నటిగా స్టార్డమ్ వచ్చినా.. చిత్ర పరిశ్రమ కోసం ఏదో చేయాలనే ఆలోచన ఎప్పుడూ ఉండేది. అందుకే కాస్త విరామం తీసుకుని నిర్మాతగా మారాలని ఫిక్స్ అయ్యా.
కెరీర్ ఆరంభంలోనే చాలా సక్సెస్‌లు చూశా. నేను నటించిన సినిమాలు వరుస విజయాలు అందుకున్నాయి. దాంతో అందరూ నన్ను ‘గోల్డెన్ లెగ్ ఆఫ్ తెలుగు సినిమా’ అని పిలిచేవారు. పోటీలో భాగమైపోయా. అభిమానుల వల్లే ఈ స్థాయికి వచ్చాను. అందుకే వాళ్లు ఎప్పుడైనా ఫొటోల కోసం అడిగితే నో చెప్పను. నాకిష్టమైన పనులతో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకుసాగుతున్నా.