నాగచైతన్య, సమంత విడిపోయి దాదాపు ఏడాది కావొస్తున్నది. ప్రస్తుతం ఇద్దరూ సినిమాల్లో బిజీగా మారారు. అయితే వారి విచ్ఛిన్నబంధం తాలూకు గాయాలు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ‘మేమిద్దరం పరస్పర ఆమోదంతో విడిపోతున్నాం. ఎంతగానో ఆలోచించుకొని పరిణతితో ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని విడాకుల సందర్భంగా ఈ జంట సోషల్మీడియా వేదికగా ఓ ఉమ్మడి ప్రకటన చేసి తాము సామరస్యపూర్వకంగా విడిపోతున్నామనే భావన కలిగించారు. అయితే విడాకు ల పూర్వం ఈ జంట ప్రయాణం కలహాలతో సాగిందని, తీవ్ర మనోవేదనతోనే వారు విడిపోయారని ‘కాఫీ విత్ కరణ్’షోలో సమంత చేసిన వ్యాఖ్యలతో అర్థమైంది.
తాజాగా ఈ జంట విఫల దాంపత్యం గురించి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు నిర్వేదం వ్యక్తం చేశారు. ఇటీవల ఓ వివాహానికి హాజరైన ఆయన ఆ వేడుక ఫొటోల్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అందులో నాగచైతన్య, సమంత పెళ్లి ఫోటోను కూడా జత చేశారు. ‘చాలా కాలం క్రితం ఓ అందమైన కథ నడిచింది..ఇప్పుడది ముగిసిపోయింది. ఇక కొత్త కథను మొదలుపెట్టాలి. కొత్త అధ్యాయాలకు శ్రీకారం చుట్టాలి’ అంటూ తాత్విక ధోరణిలో వ్యాఖ్యానించారు. సమంత, నాగచైతన్య విడిపోయినప్పటికీ వారి బంధం తాలూకు జ్ఞాపకాల్ని కుటుంబ సభ్యులు ఇంకా మర్చిపోలేదనడానికి ఈ పోస్టే నిదర్శనమని నెటిజన్లు అంటున్నారు.