ఐటెంసాంగ్ చేయొద్దన్నారు
ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు
అగ్ర కథానాయిక సమంత కొన్ని నెలల క్రితం మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడటంతో ఇక ఆమె సినీ కెరీర్ ముగిసిపోయిందనే మాటలు వినిపించాయి. అయితే సమంత ఏ దశలోనూ నిరుత్సాహానికి గురికాలేదు. వ్యాధి తాలూకు శారీరక, మానసిక ప్రతిబంధకాల్ని మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొని తిరిగి సినిమా సెట్స్‌లోకి ఉత్సాహంగా అడుగుపెట్టింది. ఆమె కథానాయికగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సమంత తన వ్యక్తిగత జీవితం తాలూకు అనేక విషయాలపై నిర్మొహమాటంగా అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. నాగచైతన్యతో విడాకులు మొదలుకొని, మయోసైటిస్ వ్యాధిపై తన పోరాటం, ఈ క్రమంలో ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
వందశాతం నిజాయితీగా ఉన్నా
దాంపత్య జీవితంలో నేను పూర్తి నిజాయితీతో వ్యవహరించా. ఏ రోజు హద్దులు దాటి ప్రవర్తించలేదు. అనుకోని కారణాల వల్ల వివాహబంధం విచ్ఛిన్నమైందనుకుంటున్నా. అందుకు నేను ఏమాత్రం పశ్చాత్తాపపడటం లేదు. చేయని నేరానికి నేనెందుకు అపరాధ భావంతో ఉండాలి? ఏదో తప్పు చేసిన దానిలా సమాజానికి దూరంగా ఎందుకు దాక్కొని ఉండాలి? అని నిరంతరం ప్రశ్నించుకొంటూ ఆత్మైస్థెర్యాన్ని ప్రోది చేసుకున్నా.
ఐటెంసాంగ్ అస్సలు వొద్దన్నారు
విడాకులు తీసుకున్న కొంతకాలానికే ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ..అంటావా’ ఐటెంసాంగ్ ఆఫర్ వచ్చింది. నా స్నేహితులు, కుటుంబ సభ్యులందరూ ఆ పాటకు ఒప్పుకోవద్దని చెప్పారు. ‘హాయిగా ఇంట్లో కూర్చో. విడాకులు తీసుకున్న ఈ టైమ్‌లో ఐటెంసాంగ్ చేస్త్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అంటూ హెచ్చరించారు. కానీ నా మనఃసాక్షి ప్రకారమే ఐటెంసాంగ్ చేశా. ఊరికే బాధపడుతూ ఇంట్లో కూర్చోవడం కంటే ఉత్సాహంగా పనిలో నిమగ్నమైతే అంతా సర్దుకుంటుందని భావించా.
అందరి పేర్లు మర్చిపోయాను
మయోసైటిస్కు వాడిన మందుల తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా సమస్యల్ని ఎదుర్కొన్నా. కొద్దిరోజుల క్రితం ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ షూటింగ్లో పాల్గొన్నప్పుడు మతిమరుపుకు గురయ్యాను. రెండు గంటల పాట సెట్లో ఉన్న వారి పేర్లు గుర్తుకు రాలేదు. ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ చెక్ చేస్తూ వారి పేర్లను గుర్తుతెచ్చుకునే ప్రయత్నం చేశా. అదొక విచిత్రమైన అనుభవం. గతంలో నాకు ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ మధ్య నేను కళ్లద్దాలు ధరిస్తున్నా. ఇప్పుడు నేనున్న ఆరోగ్య పరిస్థితుల్లో నా కళ్లు ఎక్కువ వెలుతురుని భరించలేవు. అందుకే కళ్లద్దాలతో కనిపిస్తున్నా. వ్యాధి నిర్ధారణ జరిగిన రోజు నుంచి నేను నిత్యం పోరాటం చేస్తున్నా. ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఏ నటికి రాకూడదని కోరుకుంటున్నా.