విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘ఖుషి’. సమంత నాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. శివ నిర్వాణ దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా సమంత అనారోగ్యం కారణంగా కొంతకాలం చిత్రీకరణ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతున్నది. ఈ షెడ్యూల్లో విజయ్ దేవరకొండ ఫైటర్స్‌తో పాల్గొనే యాక్షన్ సీన్స్ తెరకెక్కించబోతున్నారు.
దర్శకుడు శివ నిర్వాణ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్, ఎడిటర్ ప్రవీణ్ పూడితో కలిసి దిగిన సెల్ఫీని శివ నిర్వాణ పోస్ట్ చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తున్నది. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్నారు.