జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఇబ్బందిపెట్టే సంఘటనలు ఎన్నో పాఠాల్ని నేర్పుతాయని, వాటిని అర్థం చేసుకుంటే మరింత ధైర్యంగా ముందుకు వెళ్లొచ్చని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ఇన్స్టాగ్రామ్తో అభిమానులతో ముచ్చటించిన ఈ భామ వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా సంగతుల్ని కూడా వారితో పంచుకుంది. నేటికాలంలో విద్యార్థులు ఒత్తిడిని జయించడం చాలా ముఖ్యమని, మంచి స్నేహాలు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసి ఒత్తిడిని దూరం చేస్తాయని, కాలేజీ రోజుల్లోని స్నేహితులు అండగా ఉన్నారు కాబట్టే తాను కష్టాలను జయించానని చెప్పుకొచ్చింది సమంత.
ఈషా ఫాండేషన్ను తరచూ సందర్శించడం వెనక ఉద్దేశ్యమేమిటని ఓ అభిమాని అడగ్గా.. ఆ ప్రదేశం తనకు ఇంటితో సమానమని, అక్కడకు వెళ్తే ఏదో తెలియని ప్రశాంతత లభిస్తుందని చెప్పింది. తెలుగులో కొంత గ్యాప్ తీసుకున్నానని, స్వీయ నిర్మాణంలో నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రం ఈ నెలలోనే ప్రారంభమవుతుందని సమంత తెలిపింది. ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాతో పాటు ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ సిరీస్లో నటిస్తున్నది సమంత.