Samantha-Raj Nidimoru | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడమోరును పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ యోగా సెంటర్లోని లింగ భైరవి ఆలయంలో సోమవారం సంప్రదాయబద్ధం పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కొద్ది మంది కుటుంబీకులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫొటోలను సమంతా స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సమంత-రాజ్‌ల వివాహంపై ఈశా ఫౌండేషన్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. సమంత-రాజ్ ‘భూతశుద్ధి వివాహం’ అనే ప్రత్యేక యోగ సంప్రదాయం విధానంలోకి జరిగిందని పేర్కొంది. దాంతో చాలా మంది ‘భూత శుద్ధి వివాహం’ ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈశా ఫౌండేషన్ ఇచ్చిన వివరణ ప్రకారం.. ‘భూత శుద్ధి వివాహం’ అనేది వేల సంవత్సరాలుగా యోగ సంప్రదాయంలో కొనసాగుతున్న పవిత్రమైన వివాహ పద్ధతి. పేరుకు తగినట్లుగానే ఇది మనుషుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేయడం. వాటిని సమతుల్యంలో ఉంచడం, దంపతుల మధ్య ఆలోచనలు, భావోద్వేగాలు, భౌతికతకు అతీతంగా లోతైన బంధాన్ని ఏర్పరిచే ఆధ్యాత్మిక ప్రక్రియగా పేర్కొంది. సాధారణ పెళ్లిల్ల తరహానే సంప్రదాయ మంత్రోచ్ఛారణలతో వధూవరుల శరీరం, మనసు, జీవశక్తి స్థాయులను చేసే యోగిక క్రతువులతో నిర్వహిస్తారు. లింగ భైరవి ఆలయాల్లో, ఈశా ఫౌండేషన్ ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే ఈ విధానంలో పెళ్లిళ్లు నిర్వహిస్తారు. ఈ విధానంలో పెళ్లి జరుగడం వల్ల దాంపత్య జీవితం సామరస్యంగా, శాంతియుతంగా ఉండడంతో పాటు శ్రేయస్సును తీసుకువస్తుందని తెలిపింది. ఈ దంపతుల జీవితంలో ఆధ్యాత్మికత వికసించేందుకు, పరస్పర అనురాగం మరింత బలపడేందుకు, భవిష్యత్తులో దంపతుల ప్రయాణం శాంతి, సౌఖ్యాలతో నిండిపోవడానికి సహాయపడుతుందని ఈశా ఫౌండేషన్ వివరించింది.
అయితే, లింగభైరవి ఆలయం స్త్రీశక్తికి చెందిన ఉగ్ర కారుణ్య స్వరూపాల సమ్మేళనమని సద్గురు జగ్గీ వాసుదేవ్ గతంలో తెలిపారు. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. వాస్తవానికి సమంత గత కొద్ది సంవత్సరాలుగా లింగభైరవి ఉపాసన చేస్తున్నది. దాంతోనే ఇష్టపడ్డ రాజ్‌ను అగ్నిహోత్రం సాక్షిగా వివాహం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ వివాహంలో మరో ప్రత్యేకత ఏంటంటే అన్ని క్రతువులను కేవలం మహిళా పూజారి నిర్వహించడం. హిందూ సంప్రదాయంలో పెళ్లికి ముహూర్తం తప్పనిసరిగా చూస్తారు. వధూవరుల జాతకాల ఆధారంగా పెళ్లికి సుముహూర్తం నిర్ణయిస్తారు. కానీ, ఈ భూతశుద్ధి వివాహానికి ముహూర్తంతో సంబంధం ఉండదు. ఎప్పుడైనా ఈ పెళ్లి చేసుకోవచ్చు. ప్రస్తుతం పెళ్లిళ్లకు ఎలాంటి సు ముహూర్తాలు లేకపోవడంతో సమంత ఈ పద్ధతిని కూడా ఎంపిక చేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు.