Samantha – Raj | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహబంధంలోకి అడుగుపెట్టిన సమంత, ప్రస్తుతం భర్తతో కలిసి పోర్చుగల్ రాజధాని లిస్బన్లో హనీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్‌కు సంబంధించిన అందమైన ఫోటోలను సమంత మంగళవారం (డిసెంబర్ 30) తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. లిస్బన్లోని చారిత్రక కట్టడాలు, ప్రకృతి సోయగాలను ఈ కొత్త జంట ఎంతో ఆసక్తిగా సందర్శిస్తోంది. ఫాతిమాలోని ‘బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది రోసరీ’, ప్రసిద్ధ ‘మాన్యుమెంట్ టు ది డిస్కవరీస్’, ‘ఆర్కో డా రువా అగస్టా’ వంటి ప్రముఖ ప్రదేశాలను సమంత, రాజ్ నిడిమోరు కలిసి చూసినట్లు ఫోటోల్లో కనిపిస్తోంది.
ఒక చిత్రంలో రాజ్ నిడిమోరు చేతిలో ఉన్న చాక్లెట్ డోనట్‌ను ఆశగా చూస్తున్న దృశ్యం ఆకట్టుకోగా, మరో ఫోటోలో సమంత లిస్బన్ అందాలను ఆస్వాదిస్తూ కనిపించారు. ముఖ్యంగా పింక్ కలర్ బీనీ క్యాప్‌లో సమంత లుక్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ సమంత “డిసెంబర్ ఇలా గడిచిపోతోంది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. సమంత ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతత, ఆనందం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. “చివరికి ఆమె కోరుకున్న ప్రశాంత జీవితం దొరికింది”, “చాలా క్యూట్‌గా ఉన్నారు” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్, నిమ్రత్ కౌర్ వంటి పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా, డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో సమంత–రాజ్ నిడిమోరు వివాహం అత్యంత రహస్యంగా జరిగింది. ఈ విషయాన్ని పెళ్లి అనంతరం సమంత స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.
వృత్తిపరంగా కూడా ఈ జంట సక్సెస్ఫుల్ పార్ట్నర్స్గానే కొనసాగుతున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి భారీ ప్రాజెక్టుల్లో కలిసి పనిచేసిన సమంత, రాజ్ నిడిమోరు ఇప్పుడు ‘రక్త బ్రహ్మాండ్: ద బ్లడీ కింగ్డమ్’ అనే ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్‌లో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ, కెరీర్ పరంగానూ ఈ ఏడాది సమంతకు మరపురాని మధుర జ్ఞాపకాలతో ముగుస్తోందని ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.