Samantha | సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా కాలం తర్వాత సమంత పూర్తి స్థాయి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్‌తో మంచి హైప్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల విషయంలో కీలక మార్పు చోటుచేసుకుంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సమంత తన సొంత నిర్మాణ సంస్థపై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కుటుంబ నేపథ్యంలో సాగే కథతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండటంతో ఈ సినిమాపై సినీ ప్రియుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పటికే విడుదలైన టీజర్లో సమంత లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాధారణ గృహిణిలా కనిపిస్తూనే.. అవసరమైతే యాక్షన్ మోడ్‌లోకి వెళ్లే పవర్ఫుల్ మహిళ పాత్రలో ఆమె కనిపించనుందని స్పష్టమైంది. ముఖ్యంగా టీజర్లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. కొంతకాలంగా లేడీ ఓరియెంటెడ్ కథలపై దృష్టి పెట్టిన సమంత.. ఈ సినిమాతో మరోసారి తన నటనలో కొత్త కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భావోద్వేగాలు, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ అంశాలను మేళవిస్తూ నందిని రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
మొదట ఈ సినిమాను మే 15న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సందడి కొనసాగుతోంది. ఐపీఎల్ కారణంగా థియేటర్లకు ప్రేక్షకుల రాకపై ప్రభావం పడే అవకాశం ఉందని భావించిన చిత్రబృందం రిలీజ్‌ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మా ఇంటి బంగారం చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయాలని నిర్ణయించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమంత అభిమానులకు ఈ వాయిదా కొంత నిరాశ కలిగించినప్పటికీ.. మంచి టైమ్‌లో రిలీజ్ చేస్తే సినిమాకు మరింత కలెక్షన్లు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.