Maa Inti Bangaram | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో, రాజ్ నిడిమోరు కథనంతో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే.. గతాన్ని దాచిపెట్టి, ఒక మధ్యతరగతి అత్తవారింట్లో అడుగుపెట్టిన అమాయకపు కోడలిగా సమంత ఈ ట్రైలర్లో కనిపిస్తున్నారు. పద్ధతి గల కోడలికి ఉండాల్సిన ఏ లక్షణాలు లేవంటూ అత్తగారు విసిగించినా భరిస్తూ ఉండే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. అయితే, అత్తవారింటికి ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి సమంత ‘విశ్వరూపం’ చూపించడం ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. చీరకట్టులోనే ఆమె చేసిన యాక్షన్ సీన్స్, గన్ పట్టి విలన్లను కాలుస్తున్న విజువల్స్ మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా ‘హీరో అయినా హౌస్‌వైఫ్ అయినా డైలాగ్ కరెక్ట్‌గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే’, ‘ఒక్కొక్కరినీ కొడతాను చూడు.. ప్రేమిస్తూ!’ అంటూ సమంత చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘ఓ బేబీ’ తర్వాత సమంత, దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగా, గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, శ్రీముఖి, మంజుష తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత సమంత పూర్తిస్థాయి కమర్షియల్ యాక్షన్ రోల్లో స్క్రీన్ పైకి వస్తుండటంతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.