NTR | నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్లో 111వ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ ప్రస్తుతం కాకినాడ పోర్ట్ పరిసరాల్లో జరుగుతోంది. అయితే ఈ షూటింగ్ సందర్భంగా బాలకృష్ణకు స్వల్ప గాయం కావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో బాలకృష్ణకు మసిల్ టియర్ (కండరాల గాయం) అయినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. ఈ గాయం అంత తీవ్రమైనది కాకపోయినప్పటికీ, ఆయన త్వరగా కోలుకోవాలనే ఉద్దేశంతో డాక్టర్లు చిన్న సర్జరీ చేయాలని సూచించినట్టు వెల్లడించారు.
వైద్యుల సలహా మేరకు సర్జరీ చేయించుకోనున్న బాలకృష్ణ కొద్దిరోజుల విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ఆయన మళ్లీ కెమెరా ముందుకు రానున్నారు. ఏ వయసులోనైనా డూప్ లేకుండా రిస్కీ యాక్షన్ సీన్స్ చేయడానికి వెనుకాడని ఆయన క్రమశిక్షణ, సినిమా పట్ల ఉన్న అంకితభావం #NBK111 చిత్ర యూనిట్‌లోని ప్రతీ ఒక్కరికీ ఎంతో స్ఫూర్తినిస్తుందని నిర్మాతలు బాలయ్యని కొనియాడారు. బాలయ్యకు గాయం అయిన వార్త బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు చేశారు. #GetWellSoonBalayya అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అవుతూ అభిమానుల అభిమానాన్ని చాటింది.
ఈ క్రమంలో నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలకృష్ణ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ తారక్ చేసిన ట్వీట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. త్వరగా కోలుకోండి బాల బాబాయ్. మీరు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మళ్లీ గర్జిస్తూ ఫుల్ ఫామ్‌లో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఎన్టీఆర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నందమూరి అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రశంసిస్తున్నారు. గత కొంతకాలంగా బాలకృష్ణ, ఎన్టీఆర్ గురించి వస్తున్న పలు ఊహాగానాల మధ్య తారక్ చేసిన ఈ ట్వీట్ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది. ఇద్దరు హీరోల అభిమానులు కూడా ఈ పోస్ట్‌ను స్వాగతిస్తూ, బాలయ్య త్వరగా కోలుకుని షూటింగ్‌కు తిరిగి రావాలని కోరుకుంటున్నారు.