టాలీవుడ్ హీరోయిన్ సమంత ఏ మాత్రం తగ్గట్లేదు. వరుస సినిమాలతో రచ్చ చేస్తుంది. ఈ భాష, ఆ భాష అనే తేడా లేకుండా ప్రేక్షకులని ఫుల్‌గా ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది అక్కడ కూడా అవకాశాలను సొంతం చేసుకుంటోంది. మరోవైపు హాలీవుడ్ చిత్రం చేయబోతున్నట్టు రీసెంట్గా ప్రకటించింది.
ఓ బేబీ చిత్రాన్ని నిర్మించిన సునీత తాటి నిర్మాతగా వ్యవహరించనున్న ‘అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్ చిత్రంలో సామ్ నటించనుంది. ఈ చిత్రానికి హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహించనున్నారు. మరోవైపు తొలి సారి పుష్ప చిత్రం కోసం ఐటెం సాంగ్ చేయబోతుంది సమంత. దీనికి సంబంధించిన షూట్.. నేడు (సోమవారం) ప్రారంభమైంది.
హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. గణేశ్ ఆచార్య కొరియో గ్రఫీలో బన్నీ, సామ్ నర్తిస్తోన్న ఈ పాట ఈ సినిమాకే హైలైట్ కానుందని సమాచారం. దీనికోసం రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒక అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేశారట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప: ది రైజ్’ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల చేయనుండగా, ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. స్పెషల్ సాంగ్ కోసం సామ్ .. భారీ ఎత్తున పారితోషికం అందుకుందట.