Duniya Vijay | కన్నడ సినీ నటుడు దునియా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయన, ఆయన మొదటి భార్య నాగరత్న దంపతులకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. విడాకులు కోరుతూ దునియా విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుదీర్ఘంగా విచారణ జరిపిన బెంగళూరు హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. దునియా విజయ్, నాగరత్నకు రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు ఆయనకు మూడు నెలల గడువు ఇచ్చింది. దునియా విజయ్ 1999లో నాగరత్నను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మోనిషా, మోనికా అనే ఇద్దరు కుమార్తెలతో పాటు సామ్రాట్ అనే కుమారుడు ఉన్నారు.
అయితే కొంతకాలం తర్వాత వీరి వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో దునియా విజయ్ విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఫ్యామిలీ కోర్టు 2024లో దానిని కొట్టివేసింది. దీంతో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై సుదీర్ఘంగా విచారణ కొనసాగిన అనంతరం తాజాగా హైకోర్టు ఆయనకు విడాకులు మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. విడాకులు మంజూరు చేయడంతో పాటు నాగరత్నకు రూ.2 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు సమాచారం. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు దునియా విజయ్‌కు మూడు నెలల సమయం ఇచ్చింది.
ఈ తీర్పుతో చాలా కాలంగా కొనసాగుతున్న దునియా విజయ్–నాగరత్న విడాకుల వ్యవహారానికి న్యాయపరంగా ముగింపు లభించినట్లైంది. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం దునియా విజయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ శిరసావహిస్తానని తెలిపారు. తన పిల్లలు ప్రస్తుతం యుక్త వయసులో ఉన్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆత్మసాక్షిగా స్వీకరిస్తున్నానని పేర్కొన్నారు. తన అభిమానులు, తనతో జీవితాంతం ఉండే మీడియా మిత్రులకు కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ విషయంలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలని ఆయన తన స్పందన ద్వారా సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. దునియా విజయ్ 2016లో కీర్తి పట్టాడిని రెండో వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికే మొదటి భార్య నాగరత్నతో విడాకుల వ్యవహారం న్యాయస్థానంలో కొనసాగుతోంది.