Samantha | ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అగ్ర కథానాయిక సమంత మరోసారి స్పందించింది. ఈ విషయంలో సినీరంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు తనకు మద్దతుగా నిలిచారని చెప్పింది. కష్టకాలంలో వారు తనలో ధైర్యం నింపారని పేర్కొంది. ఆమె నటించిన తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్ని’ త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందించింది. ఆమె మాట్లాడుతూ ‘నా సినీ సహచరులు అందించిన మద్దతు వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఆత్మవిశ్వాసంతో కూర్చున్నాను. ఇండస్ట్రీ వర్గాల ప్రేమ, వారికి నాపై ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది.
కష్టాలను అధిగమించడంలో వారు అందించిన ధైర్యం ఎంతో ఉపయోగపడింది. ఒకవేళ వారందరూ నాకు మద్దతుగా నిలవకపోతే ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు చాలా సమయం పట్టేది. నా సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందించిన ప్రేమ వల్లే సమస్యలను ఎదుర్కోగలిగాను’ అని సమంత పేర్కొంది. ఆన్లైన్ ట్రోలింగ్స్ గురించి తాను ఎక్కువగా పట్టించుకోనని, నెగెటివిటీకి దూరంగా ఉండేందుకు ఎప్పుడూ ప్రయత్నం చేస్తానని సమంత తెలిపింది. ‘సిటాడెల్-హనీ బన్ని’ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.