Samantha | స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు 2025 సంవత్సరం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన ఏడాదిగా నిలిచిపోయిందని చెబుతూ ఎమోషనల్ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో కీలక మైలురాళ్లను ఈ ఏడాది చేరుకున్నానని పేర్కొంది. ఈ సందర్భంగా భర్త రాజ్ నిడిమోరుతో కలిసి ఉన్న అరుదైన పెళ్లి ఫోటోను షేర్ చేసి అభిమానులను సర్ప్రైజ్ చేసింది. 2025 ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో, క్రిస్మస్ రోజున సమంత తన ఏడాది జ్ఞాపకాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. గురువారం (డిసెంబర్ 25) చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ఫోటోలు, వీడియోలతో పాటు “కృతజ్ఞతతో నిండిన సంవత్సరం” అంటూ ఇచ్చిన క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
షేర్ చేసిన ఫోటోలలో సమంత–రాజ్ పెళ్లి దుస్తుల్లో కనిపించిన అన్‌సీన్ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫోటోలో రాజ్ ఫన్నీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వగా, సమంత చిరునవ్వుతో కనిపించింది. వీటితో పాటు జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో, తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కిన ‘శుభం’ సినిమాలో క్యామియో లుక్, క్రిస్మస్ ట్రీతో ఉన్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి. ఇక డిసెంబర్ 1, 2025న కోయంబత్తూర్‌లోని ఈషా ఫౌండేషన్‌లో యోగ సంప్రదాయ పద్ధతిలో సమంత, రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ మొదటగా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ (2021), ఆ తర్వాత ‘సిటాడెల్: హనీ బన్నీ’ (2024) వెబ్ సిరీస్‌లలో కలిసి పనిచేశారు.
2023 నుంచే వీరిద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందన్న వార్తలు వినిపించాయి. అయితే అప్పట్లో రాజ్ తన వ్యక్తిగత జీవితం గురించి అధికారికంగా స్పందించకపోవడంతో ఆ వార్తలపై అనుమానాలు కొనసాగాయి. 2024లో కలిసి ఈవెంట్లలో కనిపించడం, సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలతో వారి రిలేషన్‌షిప్‌పై స్పష్టత వచ్చింది. చివరికి ఈ డిసెంబర్లో వివాహంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాదే సమంత తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ ను ప్రారంభించి, తొలి సినిమాగా ‘శుభం’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె రాజ్ & డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ వెబ్ సిరీస్ ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్డమ్’ లో నటిస్తోంది. ఈ సిరీస్ 2026లో విడుదల కానుంది. ఇదే కాకుండా తెలుగులో తన నిర్మాణ సంస్థలోనే తెరకెక్కుతున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో లీడ్ రోల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు రాజ్ & డీకే తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ – సీజన్ 3’ ఈ నవంబర్‌లో విడుదలై మంచి స్పందన పొందింది.