Salman Khan – Salim Khan | దిగ్గజ రచయిత, నిర్మాత నటుడు సలీం ఖాన్ తనయుడిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ నటుడిగా ఎదిగాడు కండలవీరుడు సల్మాన్ ఖాన్. 1988లో వచ్చిన బీవీ హో తో ఐసీ చిత్రంతో సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించిన సల్మాన్.. ఆ తర్వాత 1989లో వచ్చిన మైనే ప్యార్ కియా చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయాడు. అనంతరం సాజన్ (1991), హమ్ ఆప్కే హై కౌన్ (1994), కరణ్ అర్జున్ (1995), కుచ్ కుచ్ హోతా హై (1998) చిత్రాలతో బాలీవుడ్లో అగ్ర నటుడిగా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా చిత్రం సికిందర్. ఈ చిత్రం రంజాన్ కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గోన్న సల్మాన్ ఖాన్ తన మొదటి సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
సల్మాన్ మాట్లాడుతూ, నా మొదటి సినిమా బీవీ హో తో ఐసీ(Biwi Ho Toh Aisi) చూసిన తర్వాత నాన్న (సలీం ఖాన్) దాని గురించి ఎక్కువగా మాట్లాడలేదు. అయితే, నన్ను హీరోగా ఊహించికున్నప్పుడు ఆయనకు నా మీద నమ్మకం కలిగింది. ఆ తర్వాత మైనే ప్యార్ కియా (1989) సినిమాతో నేను అసలైన గుర్తింపు సంపాదించాను అని తెలిపారు. 1988లో విడుదలైన బీవీ హో తో ఐసీలో సల్మాన్ సహాయ నటుడిగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా తర్వాత నాలో ఉన్న నటనను గుర్తించి నాన్న నన్ను ప్రోత్సహించారని సల్మాన్ తెలిపాడు.