షారుఖ్‌ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రంతో రికార్డులను తిరగరాశాడు తమిళ దర్శకుడు అట్లీ. ఆయన తన తదుపరి చిత్రాన్ని సల్మాన్‌ఖాన్‌తో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. నిజానికి ఇదొక మల్టీస్టారర్ సినిమా అని తెలుస్తున్నది. సల్మాన్‌ఖాన్‌తో పాటు రజనీకాంత్, కమల్హాసన్లలో ఒకరు మరో లీడ్ రోల్‌ని పోషించనున్నట్లు చెన్నై సినీ వర్గాల సమాచారం. తాజాగా ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.
పునర్జన్మల కథాంశంతో భారీ స్థాయి గ్రాఫిక్స్ హంగులతో దర్శకుడు అట్లీ ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారట. రెండు యుగాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, అందులో పూర్వ యుగం తాలూకు ఎపిసోడ్లో సల్మాన్‌ఖాన్ యుద్ధ వీరుడి పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. ఈ సినిమా కోసం రెండు భిన్న నేపథ్యాలతో సరికొత్త ఫిక్షనల్ వరల్డ్‌ను క్రియేట్ చేయబోతున్నారట దర్శకుడు అట్లీ.
ఈ ఫాంటసీ ప్రపంచాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నారట. యాక్షన్, డ్రామా, థ్రిల్లింగ్ అంశాల కలబోతగా రూపొందనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌మీదకు తీసుకెళ్తారని సమాచారం. తమిళ సూపర్‌స్టార్స్ రజనీకాంత్, కమల్హాసన్లలో ఒకరు ఈ సినిమాలో భాగమవుతారని, దర్శకుడు అట్లీ అదే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నది.