Salman Khan | బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘డాన్ 3’ చుట్టూ ముసురుకున్న వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. ఈ సినిమా నుంచి హీరో రణవీర్ సింగ్ అకస్మాత్తుగా తప్పుకోవడం, ఆ తర్వాత ఆయనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) సహాయ నిరాకరణ (నాన్-కోఆపరేషన్) ఆదేశాలు జారీ చేయడంతో వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇరు వర్గాల మధ్య సమాధానం కుదర్చడానికి మధ్యవర్తిగా రంగంలోకి దిగినట్లు సమాచారం. రణవీర్ సింగ్, దర్శకుడు ఫర్హాన్ అక్తర్ ఇద్దరితోనూ మంచి సంబంధాలు ఉన్న సల్మాన్ ఖాన్.. స్వయంగా వారిద్దరితో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించినట్లు బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా పరిశ్రమలో ఇలాంటి విభేదాలు సహజమేనని, వీటిని మరింత పెద్దది చేయవద్దని ఆయన ఫర్హాన్ అక్తర్‌కు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం ఉండేలా ఇద్దరూ ఈ వివాదాన్ని పక్కన పెట్టి ముందుకు సాగాలని సల్మాన్ సలహా ఇచ్చినట్లు సమాచారం.
డాన్ 3 ప్రాజెక్ట్ నుంచి రణవీర్ అకస్మాత్తుగా తప్పుకోవడంతో తమకి రూ. 45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిధ్వానీ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌ను, FWICEను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రణ్వీర్ డాన్ 3 ప్రాజెక్ట్ మొదలు అయ్యే 3 వారాల ముందు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ చిత్రం వివాదంలో నిలిచింది. అయితే ఈ వివాదం రచ్చకెక్కడానికి ముందే రణవీర్ టీమ్ దాదాపు రూ. 35 కోట్ల సెటిల్మెంట్ ప్రతిపాదనను నిర్మాతల ముందు ఉంచినట్లు సమాచారం. అందులో రూ. 10 కోట్లు ముందస్తుగా, మిగిలిన రూ. 25 కోట్లను భవిష్యత్తులో చేసే సినిమా రెమ్యునరేషన్లో తగ్గింపుగా ఇస్తామని ఆఫర్ చేసినప్పటికీ, ఫర్హాన్ అండ్ టీమ్ దానికి అంగీకరించలేనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ పెద్దన్నగా వ్యవహరించడంతో ఈ వివాదం ఎంతవరకు సర్దుమణుగుతుందో చూడాలి.