బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటుడిగా ఎన్ని పేరు ప్రఖ్యాతలు పొందారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఒకవైపు నటుడిగా సినిమాలు చేస్తూనే మరో వైపు పలు టీవీ షోలలో హోస్ట్‌గాను అలరిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ ఏడాది జరగనున్న ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) పురస్కారాల వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.
అబుదాబి వేదికగా, 22వ ‘ఐఫా’ వేడుకలు వచ్చే ఏడాది మార్చి 18, 19 తేదీల్లో జరగనున్నట్టు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ‘‘75వ భారత స్వాతంత్య్ర వేడుకలు, యూఏఈ 50 ఏళ్ల పండగ సందర్భంగా 22వ ‘ఐఫా’ వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం.
భారతీయ చిత్ర సీమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప కార్యక్రమంగా ఈ వేడుకను నిర్వహిస్తాం’’అని ‘ఐఫా’ నిర్వాహకులు ప్రకటించారు. సల్మాన్ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ ఈవెంట్‌పై పడింది. ఇక ఇదిలా ఉంటే సల్మాన్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే చిరంజీవి సినిమాకి ఓకే చెప్పిన సల్మాన్.. వెంకీతో కూడా ఓ మూవీ చేయబోతున్నట్టు స్పష్టం చేశాడు.