Salman Khan Team | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తూ.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘మాతృభూమి’ (Maatrubhumi: May War Rest In Peace). వార్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా సెన్సార్ బోర్డ్ (CBFC) వద్ద నిలిచిపోయిందని, సర్టిఫికేషన్ ప్రక్రియలో సమస్యలు ఎదుర్కొంటుందంటూ మీడియాలో పలు కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కథనాలపై స్పందించింది చిత్రబృందం. మీడియాలో వస్తున్న వార్తలను అవాస్తవాలని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది.
‘మాతృభూమి’ సినిమా సెన్సార్ బోర్డు వద్ద ఇబ్బందులు ఎదుర్కొంటోందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మేకర్స్ స్పష్టం చేశారు. అసలు ఈ సినిమాను ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికేషన్ కోసం సీబీఎఫ్‌సీకి సమర్పించనేలేదని, అలాంటప్పుడు ప్రక్రియ నిలిచిపోయిందనే ప్రచారానికి అర్థం లేదని వారు తేల్చి చెప్పారు. మీడియా సంస్థలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి వెరిఫై చేయని సమాచారాన్ని, పుకార్లను షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక అప్డేట్స్ అయినా సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ అధికారిక ఛానెల్స్ ద్వారా మాత్రమే పంచుకుంటామని వారు స్పష్టం చేశారు. అంతకుముందు ఈ చిత్రం ఈద్ కానుకగా ఏప్రిల్ 17న విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఈ చిత్రం ఆగస్ట్ రేస్ నుండి కూడా తప్పుకుని మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తుండగా, సల్మాన్ ఖాన్ హోమ్ బ్యానర్‌పై సల్మా ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాకు ‘బాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) అనే టైటిల్‌ను అనుకున్నారు. అయితే ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుండి చైనాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘వైబో’ (Weibo) లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. గల్వాన్ లోయ ఘటనలను ఈ సినిమాలో తప్పుగా చూపిస్తున్నారంటూ చైనీస్ నెటిజన్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) దీనిపై స్పందిస్తూ, దేశంలో సినిమా నిర్మాణాలకు సంబంధించిన విషయాలను దానికి సంబంధించిన సంబంధిత అధికారిక వర్గాలు (సెన్సార్ బోర్డు) చూసుకుంటాయని, ఇందులో విదేశాంగ శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. వివాదాల నేపథ్యంలోనే చిత్ర బృందం టైటిల్‌ను ‘బాటిల్ ఆఫ్ గల్వాన్’ నుండి ‘మాతృభూమి’గా మార్చింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ 16 బిహార్ రెజిమెంట్‌కు నాయకత్వం వహించి, సరిహద్దులో వీరోచితంగా పోరాడిన కల్నల్ సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ 60వ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో చిత్రਾਂగదా సింగ్, అభిలాష్ చౌదరి, అంకుర్ భాటియా కీలక పాత్రలు పోషిస్తుండగా, హిమేష్ రేషమియా సంగీతం అందిస్తున్నారు.