ఎప్పుడెప్పుడా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘సలార్’ది మొదటిస్థానం. ప్రభాస్, ప్రశాంత్‌నీల్ కలయికలో వస్తున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ఈ నెల 22న విడుదల కానుంది. ఆదివారం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ అయ్యింది. యాక్షన్ పార్ట్ ఎక్కువ కావడమే ఏ సర్టిఫికెట్ రావడానికి కారణమని తెలుస్తున్నది. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా నిడివి 2 గంటల 55 నిమిషాలట. ‘ ‘సలార్’ కథను రెండున్నర గంటల్లో చెప్పలేం.. ఇది సంపూర్తిగా చెప్పాలంటే మినిమమ్ అయిదు గంటలైనా పడుతుంది. అందుకే రెండు భాగాలుగా తీస్తున్నాం’ అని ప్రశాంత్‌నీల్ గతంలో చెప్పారు. ఇప్పుడు తొలి భాగమే 2గంటల 55 నిమిషాలు రావడం ఫిలింవర్గాల్లో చర్చనీయాంశమైంది. సినిమా నిడివి ఎంతున్నా బావుంటే జనం బ్రహ్మరథం పడతారనేది నిజం. దానికి గతంలో చాలా సినిమాలను ఉదాహరణగా చెప్పొచ్చు. రీసెంట్ బ్లాక్బాస్టర్ ‘యానిమల్’ కూడా 3 గంటల 26 నిమిషాలు. ఏది ఏమైనా ‘సలార్’ పాన్ ఇండియా రికార్డులను తిరిగిరాయడం ఖాయమని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.