Saiyaara Movie | బాలీవుడ్లో చిన్న సినిమాగా విడుదలై రికార్డులు సృష్టిస్తున్న చిత్రం సైయారా (Saiyaara). ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ చిత్రం వారం రోజుల్లోనే ఏకంగా రూ.150 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం క్రియేట్ చేస్తుంది. సాధారణంగా భారీ బడ్జెట్‌తో, పెద్ద స్టార్లతో తెరకెక్కే చిత్రాలు మాత్రమే ఈ స్థాయిలో వసూళ్లను సాధిస్తుంటాయి. అయితే, ‘సైయారా’ చిత్రం కంటెంట్ బలంగా ఉంటే చిన్న చిత్రాలు కూడా పెద్ద విజయాలను నమోదు చేయగలవని మరోసారి నిరూపించింది. అయితే ఈ సినిమా ఇంతటి విజయం సాధించడం పట్ల టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ధన్యవాదాలు తెలిపాడు దర్శకుడు మోహిత్ సూరి. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఒక పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే సందీప్ పోస్ట్ వలన ఈ సినిమా చాలా వరకు రీచ్ అయ్యిందని మోహిత్ తెలిపాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.
సైయారా సినిమా హిట్ అవుతుందని మొదట నమ్మిన వ్యక్తి సందీప్ వంగా (Sandeep Reddy Vanga). ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు నేను పరిచయం లేకున్నా కూడా నా సినిమాపై పోస్ట్ పెట్టి మద్దతును తెలిపాడు. నేను ఎంతో అభిమానించే దర్శకుడు. ఆయన సినిమాలను తెరకెక్కించే విధానమంటే నాకు చాలా ఇష్టం. నా స్ఫూర్తి ఆయనే. ఏ విషయాన్నైనా నిర్భయంగా చెబుతారు. దాన్ని నేను గౌరవిస్తాను. ఆయన సినిమాలు నిజమైన భావోద్వేగాన్ని నడిపించి, ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. అందుకే ఆయన కథలకు అందరూ కనెక్ట్ అవుతారు. మీలాంటి వారితో ప్రయాణం చేయడం నాకు గొప్ప గర్వంగా, ఆనందంగా ఉంది. ఎప్పటికీ నేను మీ అభిమానినే’’ అని సందీప్ వంగాకి తన కృతజ్ఞతలు తెలిపాడు మోహిత్ సూరి.
ఆషికి 2, ఎక్ విలన్, ఆవరాపన్, వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంతో ఆహాన్ పాండే, అనిత్ పడ్డా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. లవ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రం ఎటువంటి మౌత్‌టాక్ లేకుండా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
Sandeep, @imvangasandeep thank you for being the first one to openly support and express your generous belief in Saiyaara. It meant the world coming from a filmmaker whose craft I deeply admire. I’ve always respected the raw emotion, fearlessness and intensity you bring to your…
— Mohit D Suri (@mohit11481) July 24, 2025