Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి కేసు మరో కీలక మలుపు తిరిగింది. ముంబైలోని బాంద్రాలో సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడి ఆయనపై దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ జాతీయుడు మొహమ్మద్ షరీఫుల్ ఇస్లాం తాజాగా ముంబై సెషన్స్ కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో తాను నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని, శిక్ష విషయంలో తనపై కొంత కనికరం చూపించాలని కోర్టును కోరినట్లు సమాచారం. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న షరీఫుల్ ఇస్లాం.. తనపై నమోదైన కేసులో నేరాన్ని అంగీకరించాలనే ఉద్దేశంతో కోర్టులో అభ్యర్థన చేసినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామం చోటుచేసుకోవడానికి కొద్ది రోజుల ముందే కోర్టు 31 ఏళ్ల షరీఫుల్ ఇస్లాంపై తీవ్రమైన అభియోగాలను నమోదు చేసింది. సైఫ్ అలీఖాన్ నివాసంలోకి అక్రమంగా ప్రవేశించి దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో పాటు కేసులోని ఇతర అభియోగాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అభియోగాలు నమోదైన తర్వాత నిందితుడు నేరాన్ని అంగీకరించేందుకు ముందుకు రావడం కేసులో ఆసక్తికర పరిణామంగా మారింది.షరీఫుల్ ఇస్లాం దాఖలు చేసిన అభ్యర్థనపై వెంటనే నిర్ణయం తీసుకోకుండా.. ఈ అంశంపై ప్రాసిక్యూషన్ తమ స్పందనను దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో తదుపరి విచారణను వాయిదా వేసింది.ఇప్పుడు ప్రాసిక్యూషన్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది? నిందితుడి నేర అంగీకార అభ్యర్థనను కోర్టు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటుంది? అనేది ఆసక్తికరంగా మారింది.
కాగా, సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ముంబైలోని బాంద్రా నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడటం, అనంతరం సైఫ్‌పై దాడి జరగడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనలో సైఫ్‌కు గాయాలు కావడంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ కేసులో బంగ్లాదేశ్‌కు చెందిన షరీఫుల్ ఇస్లాంను పోలీసులు నిందితుడిగా అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కేసు దర్యాప్తు, కోర్టు విచారణ కొనసాగుతున్నాయి.ఇప్పుడు నిందితుడే స్వయంగా “నేరాన్ని అంగీకరిస్తాను.. శిక్ష విషయంలో కనికరం చూపండి” అంటూ కోర్టును ఆశ్రయించడం కేసులో కొత్త మలుపుగా మారింది. ప్రాసిక్యూషన్ స్పందన అనంతరం కోర్టు తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.