sampoornesh Babu| ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన హీరో సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం సినిమాతో హీరోగా పరిచయమైన సంపూర్ణేష్.. మొదటి సినిమాతోనే నటుడిగా తనదైన కామెడీ పంచ్ లు, నటనతో ఎంతగానో అలరించాడు. త్వరలో సోదరా అనే సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అయితే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి హృదయ కాలేయం డైరెక్టర్ సాయి రాజేష్ గెస్ట్‌గా హాజరై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కెరీర్ తొలి నాళ్లలో తాను పడ్డ ఇబ్బందులు, సంపూతో ఉన్న అనుబంధం గుర్తు చేసుకున్నారు.
నా తొలి సినిమా సమయంలో ఏ హీరో కూడా నా కథ వినలేదు.. ఎవరూ డేట్స్ ఇవ్వలేదు. నా బ్రతుకు అయిపోయిందని అని భావించాను. అప్పుడే నేను ఓ తమిళ సినిమా చూసాక పిచ్చి సినిమా తీసి జనాలకు ఓ పిచ్చి హీరోని క్రియేట్ చేసి ఆయనతో కామెడీ చేయిస్తే బాగుంటుందని భావించాను. ఆ క్రమంలో కొత్తగా ఎదుగుతున్న ఆర్టిస్ట్‌లకి ఐడియాలు చెప్పాను. కాని ఎవరు ముందుకు రాలేదు. అప్పుడు ప్రసాద్ లాబ్స్ లో ఒక షార్ట్ ఫిలిం చూడ్డానికి వచ్చినప్పుడు ఒక చెట్టు కింద సంపూర్ణేష్ బాబు నిలబడి ఉన్నాడు. ఉపేంద్ర సినిమాలో ఉన్నట్లు రంగు రంగుల బట్టల్లో దారుణమైన గెటప్ లో కనిపించాడు.
చూడగానే నా హీరో ఇతడే అనుకున్నాను. ఇదంతా జరిగి 13 ఏళ్లు అయింది. అప్పుడు నాకు 50-60 వేలు అప్పు ఉండేది. నాకు అది చాలా పెద్ద అమౌంట్. కానీ నా దగ్గర ఉన్న కథను నమ్మి ముందుకు వెళ్ళా. సంపూ సిద్దిపేట నుంచి హైదరాబాద్ వచ్చి కథా చర్చల్లో పాల్గొని వెళుతుండేవాడు. ఆ సమయంలో నా దగ్గర ఉన్న డబ్బుల్లో కొంత సంపూకి ఇచ్చాను. అయితే ఎలా స్టార్ట్ చేసామో, ఎట్లా కంప్లీట్ చేశామో.. కాని సినిమా తీసాం. సంపూ హీరో అయిపోయాడు.. నేను డైరెక్టర్ అయిపోయాను. ‘హృదయ కాలేయం’ సూపర్ హిట్ అయిన తర్వాత నాకు ఎవరు డబ్బులు కట్టలేదు. కానీ అతనిని లక్షల్లో రెమ్యునరేషన్ ఇచ్చారు. నేను సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉంటే, సంపూ సిద్దిపేటలో 4 అంతస్తుల ఇల్లు కట్టేశాడు. నేను క్రెడిట్ కార్ట్ వాడి కష్టపడి నానో కార్ కొంటే.. మనోడు ఫోర్డ్ కారు కొనుక్కున్నాడు. ‘కొబ్బరి మట్ట’ సినిమా మూడేళ్లు తీసినప్పుడు నేను ఫైనాన్సియల్ గా చితికిపోయి ఉన్నానని సంపూకి అర్థమైంది.
అప్పుడు ఏదో ఒక సినిమా ఓకే చేసి వచ్చిన డబ్బులో రూ.6 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి నాకు హోండా కారు కొనిచ్చాడు. నాకు ఇళ్లు లేదని తన వైఫ్ అంటే.. అప్పుడు నాకు చెప్పకుండా బిల్డర్ కి రూ.12 లక్షలు అడ్వాన్స్ కట్టేశాడు. ఇంకో 13 లక్షలు నువ్వు కట్టాలి.. ఏం చేసుకుంటావో చేసుకో. లేకపోతే నేను కట్టిన డబ్బులు పోతాయి అని చెప్పాడు. కాని నా దగ్గర డబ్బులు లేవు. ఎలాగోలా చేసి ఇల్లు కొనుకున్నాను అని సాయి రాజేష్ అన్నారు. ఏ రోజుకైనా సంపూ కోసం నేనుంటాను.. నాకోసం సంపూ ఉంటాడు అని సాయి రాజేష్ చాలా ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.