సమకాలీన కథానాయికల్లో సాయిపల్లవి చాలా ప్రత్యేకం. పాత్ర నచ్చితే తన పారితోషికాన్నే కాదు, హీరో ఇమేజ్‌ని కూడా పట్టించుకోదు. నచ్చకపోతే.. కోట్లిచ్చినా సినిమా చేయదు. అందుకు టాలీవుడ్లోనే చాలా నిదర్శనాలున్నాయి. లవ్‌స్టోరీ, విరాటపర్వం, తండేల్ సినిమాలు ఆమె ఒప్పుకోడానికి కారణం ఆ సినిమాల్లో ఆమె పాత్రలకు ఉన్న వెయిటే. ఈ క్రమంలోనే చాలా తెలుగు సినిమాలకు నో చెప్పేసిందామె. దానికి కారణం ఆయా పాత్రలు ఆమెకు నచ్చకపోవడమే. ప్రస్తుతం సాయిపల్లవి బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తున్నది. అందులో ఒకటి ‘రామాయణ’ కాగా, రెండోది అమీర్‌ఖాన్ తనయుడు జునైద్‌ఖాన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం. నిజానికి బాలీవుడ్లో సాయిపల్లవి డెబ్యూగా ‘రామాయణ’ ఉంటుందని అందరూ భావించారు. కానీ.. అనుకోకుండా జూనైద్ఖాన్ సినిమా ముందు విడుదలవుతున్నది.
ఈ సినిమాకు ‘ఏక్ దిన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారట. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. నిజానికి జూనైద్పై బాలీవుడ్లో అంత గుడ్ ఒపీనియన్ లేదు. ఆయన గత ప్రాజెక్టులు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు సాయిపల్లవి డెబ్యూ అతని సినిమానే కానుంది. దాంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాయిపల్లవి పాత్రనే తప్ప, హీరో ఇమేజ్‌ని పట్టించుకునే వ్యక్తి కాదు. పాత్రను నమ్మి ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పింది. ‘ఏక్ దిన్’ విజయంపై పూర్తి విశ్వాసంతో ఉంది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలని సాయి పల్లవి అభిమానులంతా ఆశిస్తున్నారు.