క్రూరుడైన ఓ నిరంకుశ పాలకుడి నుంచి స్వజనులను, మాతృభూమిని విముక్తి చేయడానికి ఓ సాహసి తిరుగుబాటు జెండా ఎగరేస్తాడు. ఆధిపత్యాన్ని ఎదిరిస్తూ అత్యంత ప్రమాదకరమైన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేమిటి? తన వారి స్వేచ్ఛకోసం అతను చేసిన పోరాటం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చూడాల్సిందే అంటున్నారు మూవీ మేకర్స్.
సాయిదుర్గతేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మాతలు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇటీవలే ముంబైలో కీలక షెడ్యూల్ పూర్తయింది. ఇందులో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు పాల్గొన్నాడని, ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత తమ సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని, సాయిధరమ్‌తేజ్ పాత్ర అత్యంత శక్తివంతంగా సాగుతుందని మేకర్స్ తెలిపారు.