సాయిధరమ్‌తేజ్ తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. గత ఏడాది జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన క్రమంగా కోలుకున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందుకొచ్చారు. ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ పతాకాలపై ప్రముఖ దర్శకుడు సుకుమార్, అగ్ర నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిస్టిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సోమవారం సాయిధరమ్‌తేజ్ స్టిల్‌ను విడుదల చేశారు. ‘బ్లాక్ మేజిక్ నేపథ్య కథాంశమిది. వరుస చావులకు కారణం తెలుసుకోవడానికి ఓ గ్రామంలోకి వెళ్లిన హీరోకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది ఉత్కంఠను పంచుతుంది. అనేక మలుపులతో కథ సాగుతుంది. ఇప్పటికే ముప్పైశాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం పేర్కొంది.