Sada | సదా పేరు చెబితే చాలామందికి ‘జయం’ సినిమాలో ఆమె చెబుతున్న “వెళ్ళవయ్యా వెళ్ళూ…” అనే డైలాగ్ వెంటనే గుర్తొస్తుంది. ఆ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తన టాలెంట్‌తో అతి తక్కువ సమయంలో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు, లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపరిచితుడు’లో అవకాశం దక్కించుకుంది. దీంతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయినా, ఆమె కెరీర్ ఊహించినంత ముందుకు సాగలేదు.
‘అపరిచితుడు’ తర్వాత సదా సరైన స్క్రిప్ట్‌లు ఎంచుకోలేకపోయింది. వరుస ఫ్లాపులతో ఆమె క్రేజ్ తగ్గుతూ వచ్చింది. సినిమాలు ఆశించిన స్థాయి చేరకపోవడంతో పాటు, కొన్ని గోల్డెన్ ఆఫర్స్‌ను వదులుకోవడం కూడా ఆమె కెరీర్‌కు ఎదురుదెబ్బ అయ్యింది. చంద్రముఖి సినిమాలో మొదటగా జ్యోతిక పాత్రకు సదాకే అవకాశం వచ్చింది. కానీ ‘అపరిచితుడు’ షూటింగ్ కారణంగా డేట్స్ కుదరక, ఆ అవకాశాన్ని కోల్పోయింది. శేఖర్ కమ్ముల ‘ఆనంద్’ చిత్రం కోసం కూడా మొదటగా సదానే అని అనుకున్నారు. కానీ ఆమె ఆ ప్రాజెక్ట్‌ను తిరస్కరించడంతో మరో హీరోయిన్‌కి ఆ అవకాశం దక్కింది.
ఇలా సదా అప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో తన కెరీర్ సందిగ్ధంలో పడ్డట్టు అయింది. అయితే సిల్వర్ స్క్రీన్ దూరమైనా, సదా బుల్లితెరపై కొన్నాళ్లు తన హవా కొనసాగించింది. ‘ఢీ’, ‘నీతోనే డాన్స్’ వంటి డ్యాన్స్ షోలు జడ్జిగా హాజరై మళ్లీ పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ఇటీవలి కాలంలో సినిమా, టీవీ రెండినీ కూడా పక్కనపెట్టి సదా పూర్తిగా కొత్త దిశగా అడుగులు వేసింది. సదా ఇప్పుడు కెమెరా ముందుకు కాకుండా కెమెరా వెనకకు వెళ్లింది! ఆమె ప్రస్తుతం వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీపై పూర్తిగా ఫోకస్ పెట్టింది. ‘Sadaa Green Life’ అనే యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించి, అడవుల్లో జంతువుల వీడియోలు చిత్రీకరించి షేర్ చేస్తోంది.ఇటీవల ఆమె తన నికాన్ కెమెరాతో ఆఫ్రికా అడవుల్లో ఓలోమిన జాతికి చెందిన సింహాన్ని చిత్రీకరించింది. ఆ సింహం స్లోమోషన్లో నడుస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసినవారంతా సదా ఫోటోగ్రఫీ టాలెంట్‌కి ఫిదా అయ్యారు.