మంచి రోజులు మొదలైతే, అవి కొన్నేళ్లపాటు సాగుతూనే ఉంటాయి. ఆ సమయంలో జాగ్రత్తపడితే ఇక జీవితం అంతా ఆనందమే. కన్నడ కస్తూరి రుక్మిణి వసంత్‌కు ప్రస్తుతం మంచి రోజులు నడుస్తున్నాయి. ‘సప్తసాగరాలు దాటి’ సినిమా ఏ ముహూర్తాన తెలుగులో విడుదలైందో అక్కడి నుంచి రుక్మిణి వసంత్‌కి శుక్ర మహర్దశ మొదలైంది. ఆమె తాజా విజయం ‘కాంతార: చాప్టర్ 1’ దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కన్నడ అగ్రహీరో యష్ హీరోగా రూపొందుతున్న ‘టాక్సిక్’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నది రుక్మిణి వసంత్.
అలాగే తారక్, ప్రశాంత్‌నీల్ సినిమాలోనూ రుక్మిణి వసంతే కథానాయిక. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణలో కూడా ఆమె పాల్గొన్నదని సమాచారం. ఇదిలావుంటే.. ఈ అందాలభామను ఇప్పుడు అపరూపమైన మరో అవకాశం వరించిందని తెలిసింది. రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ‘ఆర్సీ 17’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ కథానాయికగా ఎంపికైందట. ఇదే నిజమైతే ఈ అమ్మడి దశ తిరిగినట్టే. ఇప్పటికే సుకుమార్ కథను రెడీ చేశారనీ, ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయనీ, వచ్చే ఏడాది జూలైలో ఈ సినిమా సెట్స్‌కి వెళుతుందని వినికిడి.