RRR @ USA | ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు మరో కొత్త రికార్డును తన కిరీటంలో చేర్చుకున్నది. ఈ సినిమా విడుదలై 10 నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఆ సినిమాకు ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గడంలేదు. ఆస్కార్ బరిలో నిలిచిన ఈ సినిమా ఇటీవల అమెరికాలో కొత్త రికార్డు నెలకొల్పింది.
లాస్ ఏంజెల్స్‌లోని చైనీస్ థియేటర్లో ఈ చిత్రాన్ని ఇటీవల ప్రదర్శించారు. ఈ థియేటర్ ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ థియేటర్. ఇందులో 932 మంది కలిసి కూర్చుని సినిమా వీక్షించవచ్చు. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శన కోసం టికెట్ బుకింగ్ ప్రారంభించగా.. అన్ని టిక్కెట్లు కేవలం 98 సెకండ్లలోనే అమ్ముడైపోయాయని ఫిల్మ్ స్క్రీనింగ్ నిర్వాహకులు బియాండ్ ఫెస్ట్ వెల్లడించింది. ఇంతవరకు ఏ భారతీయ చిత్రానికి కూడా ఇంతపెద్ద రికార్డు సాధ్యం కాలేదని, ఇది చారిత్రాత్మకమని వారు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా విమర్శకులచే ప్రశంసలు కూడా అందుకున్నది. కాగా, ఈ సినిమాకు జపాన్‌లో కూడా మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమాలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు పరిశీలనకు ఎంపికైంది. గత ఏడాది మార్చి 24 న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఆర్ఆర్ఆర్ సినిమా.. మొత్తం రూ.1200 కోట్లను రాబట్టింది. ఇండియాలోనే రూ.800 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. మన దేశంలో ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజైంది.