‘మా కుటుంబం నుంచి ఆశిష్ హీరో అవుతాడని అనుకోలేదు. అతనికి నటన అంటే ఎంతో తపన ఉంది. అమెరికా, ముంబయి, విశాఖపట్నంలో యాక్టింగ్ శిక్షణ తీసుకున్నాడు. ప్రేక్షకుల్ని మెప్పించడం అతని ముందున్న పెద్ద లక్ష్యంగా భావిస్తున్నా’ అని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ఆయన సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్ నిర్మాతలు. సోమవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను వి.వి. వినాయక్, మోషన్ పోస్టర్‌ను దర్శకుడు సుకుమార్ విడుదల చేశారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘దర్శకుడు వినాయక్ తన తొలి సినిమా ‘దిల్’ను మా బ్యానర్లో చేసి నా పేరునే దిల్‌రాజుగా మార్చేశాడు. ఈ రోజు మేం ఎంత సాధించినా ‘దిల్’ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మా సంస్థ తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేస్తోంది. మా ప్రయాణం ఓ అద్భుతంగా అనిపిస్తోంది. ఇండస్ట్రీలో హీరోగా సక్సెస్ కావడం అంత సులభం కాదు. ప్రేక్షకులు సినిమా చూసి కనెక్ట్ అయితేనే ఏ హీరోకైనా భవిష్యత్తు ఉంటుంది. ఆశిష్ మంచి హీరోగా నిలుస్తాడనే నమ్మకం ఉంది. నేటి యువత కోరుకునే అన్ని అంశాలున్న కథ ఇది. చిత్రీకరణ పూర్తయింది. అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’ అన్నారు. ఆశిష్ గొప్ప హీరోగా ఎదగాలని కోరుకుంటున్నానని వినాయక్ అన్నారు. పరిశ్రమకు ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేసిన సంస్థ నుంచి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్‌కు గొప్ప భవిష్యత్తు ఉండాలని సుకుమార్ ఆకాంక్షించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కాలేజీలో చేరిన కొత్తలో మనలో తెలియని ఎనర్జీ ఉంటుంది. దాంతో రచ్చ చేస్తాం. ఈ సినిమాలో కూడా రౌడీబాయ్స్ చేసే హంగామా ఏమిటి? వారి పనుల వల్ల ఎలాంటి పర్యవసానాలు ఏర్పడ్డాయన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు. హీరో ఆశిష్ మాట్లాడుతూ ‘మా కుటుంబం అందించిన మద్దతుతోనే ఈ స్థాయికి వచ్చాను. మా నాన్నకు, దిల్‌రాజు బాబాయ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అన్నారు.