Champion Movie | ఈ క్రిస్మస్ బరిలో నిలిచిన సినిమాల్లో ప్రత్యేకంగా కనిపించింది ఛాంపియన్. శ్రీకాంత్ తనయుడు రోషన్ రీలాంచ్ సినిమా కావడం, వైజయంతీ, స్వప్న సినిమాస్ లాంటి భారీ బ్యానర్ లో రావడంతో ఆసక్తి ఏర్పడింది. అంతేకాదు.. నేషనల్ అవార్డ్ విజేత ప్రదీప్ అద్వైతం దర్శకుడు కావడం, పాటలు జనాల్లోకి వెళ్ళడం, అన్నిటికీ మించి తెలంగాణ బైరాన్ పల్లి చరిత్ర నేపధ్యంలో వస్తున్న కథ కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలని ఛాంపియన్ అందుకుందా? రోషన్ ఖాతాలో హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.
కథ:1947 ఆగష్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ అప్పటికి హైదరాబాద్ ఇంకా నిజాం పాలనలోనే వుంది. నిజాం ప్రభువు హైదరాబాద్ స్వాతంత్ర దేశం కోసం ప్రయత్నాలు చేస్తున్న కాలమది. అయితే రజాకార్ సైన్యానికి అధ్యక్షుడిగా ఖాసిం రజ్వీ ప్రజలని హింసిస్తుంటాడు. రజాకార్ల దౌర్జన్యాలను ఎదుర్కొ నేందుకు బైరాన్ పల్లి ప్రజలు ఒక దళంలా ఏర్పడి సాయుధ పోరాటం చేస్తుంటారు. ఇదే సమయంలో సికింద్రాబాద్ బ్లూస్ టీంలో కీలక ఫుట్‌బాల్ ఆటగాడు మైఖేల్ సి విలియమ్స్ (రోషన్). ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ ఆడాలనేది తన కల. కాకపోతే అనుకోని పరిస్థితులు కారణంగా భైరాన్‌పల్లి గ్రామం చేస్తున్న పోరాటంలోకి అడుగుపెడతాడు మైఖేల్. ఆ తర్వాత ఏం జరిగింది? బైరాన్ పల్లి పోరాటంలో తనూ చేతులు కలిపాడా? ఇంగ్లాండ్ వెళ్లాలనుకున్న తన కల నెరవేరింది? రజాకార్ సైన్యానికి, బైరాన్ పల్లికి మధ్య ఎలాంటి పోరాటం జరిగిందనేది మిగతా కథ.
విశ్లేషణ: బైరాన్పల్లిసాయుధ పోరాటాన్ని, మైఖేల్ సి విలియమ్స్ అనే ఫుట్‌బాల్ ఆటగాడి కథను ముడిపెట్టి రాసుకున్న ఫిక్షనల్ స్టొరీ ఇది. భైరాన్‌పల్లి సాయుధ పోరాటం నేపధ్యాన్ని పరిచయం చేస్తూ కథమొదలౌతుంది. పీరియాడిక్ సన్నివేశాని దర్శకుడు చక్కగా తీర్చిదిద్దాడు. కథలో కావాల్సినంత డ్రామా, భావోద్వేగ చూపించగలిగాడు. మైకేల్ (రోషన్) ఫుట్‌బాల్ ఛాంపియన్ ట్రాక్ కూడా ఆసక్తికరంగా వుట్నుంది. తను బైరాన్ పల్లిలోకి అడుగు పెట్టే తర్వాత వచ్చే సన్నివేశాలు కొన్ని నెమ్మదిగా అనిపించినప్పటికీ ఇంటర్వెల్ సీక్వెన్స్ తో కథలో తీవ్రత మరింతగా పెరుగుతుంది.
సెకండ్ హాఫ్‌లో తెలంగాణ సాయుధ పోరాటం, వారి లక్ష్యాన్ని చూపించిన తీరు నిజాయితీగా వుంటుంది. నైజాం పాలనలో జరిగిన అణచివేతను దర్శకుడు ప్రభావవంతంగా చూపించగలిగాడు. ప్రీఇంటర్వెల్ లో రోషన్ ఫుట్ బాల్ ఆడే సన్నివేశం చాలా ఎఫెక్టివ్ గా వచ్చింది. ఇక క్లైమాక్స్ లో బైరాన్ పల్లి పోరాటం చూపించిన తీరు ప్రేక్షకులని కట్టిపడేస్తుంది. బైరాన్ పల్లి పోరాటాన్ని ఈస్థాయిలో చూపిస్తారని ఎవరూ ఊహించి వుండరు. అంత హెవీగా వార్ సీన్స్ ని తీర్చిదిద్దారు.
నటీనటులు: రోషన్ తన బెస్ట్ ఇచ్చాడు. ఇలాంటి హిస్టారికల్ సినిమాల్లో ఒక ప్రధాన పాత్రని మోయడం అంత ఈజీకాదు. అయితే రోషన్ ఆ పనిని సమర్దవంతంగా చేయగలిగాడు. మైఖేల్ పాత్రలో తన నటన గుర్తుండిపోతుంది. అనస్వర రాజన్ పాత్ర బావుంది. ప్రేమకథని చాలా చక్కగా డీల్ చేశారు. రాజి రెడ్డి పాత్రలో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, ఆయన భార్య పాత్రలో అర్చన హుందాగా కనిపించారు. దుల్కర్ సల్మాన్ అతిధి పాత్రలో మెరిశారు. ప్రకాష్ రాజ్, మురళిధర్, మురళిశర్మ, రచ్చరవి ఈ పాత్రలనీ కథకు తగ్గట్టుగా కుదిరాయి.
టెక్నికల్ గా: సినిమా టెక్నికల్ స్టాండర్డ్స్, ప్రొడక్షన్ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. మిక్కీజే మేయర్ స్వరపరిచిన గిరగిర, సల్లంగుండాలే పాటలు ఆకట్టుకున్నాయి. నేపధ్య సంగీతం కూడా బావుంది. సినిమాలో విజువల్ గ్రాండియర్ వుంది. స్వప్న సినిమాస్ నిర్మాణ విలువలు సినిమాని ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ప్లస్ పాయింట్స్
రోషన్ నటన
బైరాన్ పల్లి, తెలంగాణ సాయుధ పోరాటం
టెక్నికల్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడా నెమ్మదించిన కథనం
రేటింగ్: 3.25/5