Roja | ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమలను ఓ ఊపు ఊపిన రోజా ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. దాదాపు 125కు పైగా సినిమాలు చేసిన రోజా, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత సినీ కెరీర్‌కి గుడ్‌బై చెప్పింది. తరువాత ‘జబర్దస్త్’ టీవీ షో ద్వారా ప్రేక్షకులకి దగ్గరగా ఉన్న రోజా, మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ షోను కూడా వదిలేసింది. దీంతో ఆమె ఇక మళ్లీ సినిమాలు చేయరని అందరూ భావించారు. కానీ, తాజాగా ఆ అంచనాలు తారుమారయ్యాయి.ఏపీ ప్రభుత్వం మారిన నేపథ్యంలో రోజా మళ్లీ సినిమాలు, టీవీ రంగంలో బిజీగా మారుతోంది. ఇప్పటికే పలు టీవీ షోలలో జడ్జిగా, గెస్ట్‌గా హాజరవుతూ రీ-ఎంట్రీ ఇచ్చిన రోజా ఇప్పుడు సినిమా రంగంలోకి కూడా తిరిగి అడుగుపెట్టబోతోంది.
తాజాగా తమిళ సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై డీ.డి. బాలచంద్రన్ దర్శకత్వంలో లెనిన్ పాండ్యన్ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రోజా కీలక పాత్రలో నటిస్తోంది. రోజా రీ-ఎంట్రీ సందర్భంగా నటి ఖుష్బూ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు.ఆ వీడియోలో రోజా 90లలో చేసిన హిట్ సినిమాల క్లిప్స్‌తో పాటు, కొత్త సినిమాకు సంబంధించిన సన్నివేశాలను చూపించారు. “90s క్వీన్ రోజా తిరిగి వస్తోంది!” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియోలో రోజా డీ-గ్లామరస్ లుక్‌లో, వయసైపోయిన, బాధతో ఉన్న పెద్దావిడ పాత్రలో కనిపించింది. ఈ లుక్ చూసిన అభిమానులు రోజా మరోసారి నటనతో ఆకట్టుకోబోతోందని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడీ రీ-ఎంట్రీతో రోజా తిరిగి వరుసగా సినిమాలు చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. అయితే, అభిమానులు మాత్రం ఆమె తిరిగి వెండితెరపై కనిపించబోతుందనే వార్తతో ఉత్సాహంగా ఉన్నారు. చూస్తుంటే రానున్న రోజులలో తెలుగులో కూడా పలు సినిమాలు చేసే అవకాశం ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.