హీరో నితిన్ నటించిన ‘రాబిన్ హుడ్’ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని చిత్ర నిర్మాత వై.రవిశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గుబ్బల మంగమ్మ ఆలయాన్ని సోమవారం హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
అశ్వారావుపేటకు చెందిన తాను స్వశక్తితో దర్శకుడిగా మంచిపేరు తెచ్చుకున్నానని, ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలతో ఇండస్ట్రీలో గుర్తింపు లభించిందని వివరించారు. మూడో సినిమా ‘రాబిన్ హుడ్’కు ప్రేక్షకులు ఆదరణ తప్పకుండా లభిస్తుందని, వినోదంతో కూడిన ఒక మంచి మెసేజ్ సినిమాలో ఉంటుందని గ్యారంటీ ఇచ్చారు. చిరంజీవితోనూ సినిమా ఉంటుందని, ‘రాబిన్ హుడ్’ విడుదల తర్వాత చిరంజీవిని కలువనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హీరో నితిన్ భక్తులతో కలిసి సందడి చేశారు. అందరితోనూ సెల్ఫీలు దిగారు.