Rishab Shetty | ఇతిహాసంలో ఎందరో రాజులు అధికారంలోకి వచ్చారు.. వెళ్లిపోయారు. కానీ విజయనగర సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేసిన మహాప్రతిభాశాలి శ్రీకృష్ణదేవరాయలు మాత్రం చరిత్రలో నిలిచిపోయారు. సుపిరిపాలనతో, సాహిత్యంలో ప్రోత్సాహంతో, ధర్మరాజుగా, మహా చక్రవర్తిగా ఆయనకున్న ఖ్యాతి అపారమైంది.తుళువ వంశానికి చెందిన ఆయన 1471లో జన్మించి, 1509లో గద్దెనెక్కి 1529 వరకు దాదాపు 20 ఏళ్ల పాటు విజయవంతంగా పాలించారు. ఆయన పాలనను తెలుగు సాహిత్య స్వర్ణయుగంగా చరిత్రకారులు ప్రశంసిస్తారు. అతని ఆస్థానాన్ని అలంకరించిన ఎనిమిది మంది మహాకవులను ‘అష్టదిగ్గజాలు’గా పిలిచేవారు. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, తెనాలి రామకృష్ణ వంటి గొప్ప కవులు అప్పట్లో రాజసభను గొప్పగా వెలుగొందించారు.
ఇప్పటికే శ్రీకృష్ణదేవరాయల పాత్రను పలు చిత్రాల్లో పలువురు ప్రముఖులు పోషించారు.1956లో వచ్చిన తెనాలి రామకృష్ణ,1962లో వచ్చిన మహామంత్రి తిమ్మరుసు చిత్రాల్లో నందమూరి తారకరామారావు రాయల పాత్రలో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు.ఆదిత్య 369లో ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ పోషించిన రాయల పాత్రకు మంచి స్పందన వచ్చింది. అలాగే హీరో శ్రీకాంత్ ‘దేవరాయ’ సినిమాలో రాయలుగా కనిపించి మెప్పించాడు. కాంతార చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి, ఇప్పుడు మరో హిస్టారికల్ ప్రాజెక్ట్‌కి సిద్ధమవుతున్నట్టు టాక్. ఇప్పటికే ఆయన ‘కాంతార 2’ అనే ప్రీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తూ నటిస్తున్నారు.
అంతేకాదు, మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ బయోపిక్‌లోనూ నటించనున్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకృష్ణదేవరాయల జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కించబోయే భారీ బయోపిక్‌లో ఆయన టైటిల్ రోల్లో కనిపించనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ‘జోధా అక్బర్’, ‘పానిపట్’, ‘లగాన్’ వంటి క్లాసిక్ సినిమాలకు దర్శకుడిగా పేరొందిన అశుతోష్ గోవారికర్ తెరకెక్కించనున్నాడట. రిషబ్ శెట్టి – అశుతోష్ కాంబో అంటేనే అంచనాలు ఆకాశానికెత్తిపోతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌పై ఇంకా ఆధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఇక రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహిస్తున్న ‘కాంతార 2’ ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఇతిహాసంలో చిరస్థాయిగా నిలిచిపోయిన రాజు పాత్రలో కనిపించే అవకాశం రావడం ఏ నటుడికైనా గర్వకారణమే. అది కూడా శ్రీకృష్ణదేవరాయల వంటి గొప్ప చరిత్ర గల మహారాజు పాత్ర పోషించాల్సి వస్తే ఆ నటుడి కెరీర్లో పంట పండినట్టే అంటున్నారు.