Ram Gopal Varma | గత కొంతకాలంగా తాను తీస్తున్న సినిమాల పట్ల ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఇటీవల తన సోషల్‌మీడియా పోస్ట్‌లో పశ్చాత్తాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘సత్య’ సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, తాను ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని, ఇక నుంచి తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేశారు. ఆ దిశగా అడుగులు వేయడానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ‘సిండికేట్’ పేరుతో రామ్‌గోపాల్‌వర్మ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘అత్యంత భయంకరమైన జంతువు ఒక్క మనిషి మాత్రమే’ అనే పాయింట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.
‘70దశకంలో ఉండే వీధి రౌడీలు అనంతరం రాజకీయాలను వృత్తిగా చేపట్టడంతో కనుమరుగయ్యారు. బంగారం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల స్మగ్లర్లు ఆర్థిక సంస్కరణ వల్ల ఆ వృత్తిని వదిలేశారు. ముంబయి డీ కంపెనీ, ఆల్‌ఖైదా వంటి టెర్రరిస్ట్ సంస్థలు పతనావస్థకు చేరాయి. వీరందరికి కంటే ప్రమాదకరంగా ఇప్పుడు ‘సిండికేట్’ రాబోతున్నది. ఇది రాజకీయ సంస్థలు, రాజకీయాలు, బడా పారిశ్రామిక వేత్తలు, మిలిటరీ కలబోసిన పవర్ఫుల్ ‘సిండికేట్’. ఆధునిక భారతాన్ని ప్రమాదంలో నెట్టేసే భయంకరమైన కూటమి. నేరం కాలానికి అనుగుణంగా ఎలా రూపాన్ని మార్చుకుంటుందో ఈ సినిమాలో చూడబోతున్నారు. ఇదొక ఫ్యూచరిస్టిక్ సినిమా అనుకోవచ్చు. సమీప భవిష్యత్తుకు అద్దం పడుతుంది. గత కొంతకాలంగా దర్శకుడిగా నేను చేసిన తప్పులను, వైఫల్యాలను ఈ ‘సిండికేట్’ తుడిచివేస్తుందని వాగ్దానం చేస్తున్నా’ అని రామ్‌గోపాల్‌వర్మ పేర్కొన్నారు.