RGV- Nag | తెలుగు సినీ చరిత్రలో సరికొత్త యుగాన్ని ఆవిష్కరించిన చిత్రం ‘శివ’. ఈ సినిమాతో నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ (RGV) దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చి, సాంకేతికంగా, కంటెంట్ పరంగా కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. 1989లో విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్ ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది.ఇప్పుడు ఈ ‘శివ’ సినిమా 4K ఫార్మాట్లో రీ-రిలీజ్ అవుతుండగా, దానికి సంబంధించిన ప్రెస్ మీట్లో నాగార్జున, ఆర్జీవీ ఇద్దరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా “మళ్లీ నాగార్జున–ఆర్జీవీ కాంబినేషన్లో సినిమా వస్తుందా?” అనే ప్రశ్న లేవనెత్తగా, అందుకు నాగార్జున సమాధానమిస్తూ ..“రామ్ గోపాల్ వర్మపై నాకు ‘శివ’ సమయంలో ఎంత నమ్మకం ఉందో, ఇప్పటికీ అంతే నమ్మకం ఉంది. అన్ని సెట్ అయితే తప్పకుండా ఆయనతో మళ్లీ సినిమా చేస్తాను” అని తెలిపారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై ఆర్జీవీ స్పందన ఆసక్తికరంగా మారింది. ఆయన మాట్లాడుతూ.. నేను ఇప్పుడే నాగార్జునతో సినిమా చేయను. ముందు నేను ఒక హిట్ కొట్టాలి ఆ తర్వాతే నాగార్జున దగ్గరకు వెళ్తాను. హిట్ కొట్టేదాకా ఆయనతో సినిమా చేయను అని స్పష్టం చేశారు. ఆర్జీవీ ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో ఇద్దరి కాంబోలో ‘శివ’, ‘ద్రోహి’, ‘గోవిందా గోవిందా’, ‘ఆఫీసర్’ చిత్రాలు వచ్చాయి. అయితే 2018లో వచ్చిన ఆఫీసర్ ఫ్లాప్ అవ్వడంతో ఆ తర్వాత ఇద్దరూ కలిసి పనిచేయలేదు.
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ హిందీలో ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా విజయవంతమైతే, మళ్లీ నాగార్జున–ఆర్జీవీ కాంబోలో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి శివ” రీ-రిలీజ్‌తో మళ్లీ ఆ గోల్డెన్ కాంబో చర్చల్లోకి వచ్చింది. ఇప్పుడు అందరి దృష్టి ఆర్జీవీ తదుపరి ప్రాజెక్ట్‌పైనే ఉంది. రాము మళ్లీ తన టాలెంట్‌ని నిరూపించుకోవల్సిన సమయం వచ్చిందని, టాలీవుడ్ మీ నుండి ఉన్నత చిత్రాలు రావాలని కోరుకుంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు.